Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 8న కలెక్టరేట్ల ఎదుట ధర్నా :రజక వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రజకుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్నదని రజక వృత్తిదారుల సంఘం (టీఆర్వీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 8న కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని టీఆర్వీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్ అధ్యక్షతన రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది. ఎనిమిదేండ్లుగా రజకులను రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతున్నదనీ, వారికిచ్చిన వాగ్దానాలు అమలు చేయటం లేదని తెలిపారు. జీ.వో 190 ప్రకారం రుణాల కోసం దరఖాస్తు చేసిన రజక వృత్తిదారులందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రజక ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యాసంస్థలు తదితర వృత్తి కాంట్రాక్టులను రజక వృత్తిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నూతనంగా దోబీగాట్ల నిర్మాణం చేపట్టడం లేదని పేర్కొన్నారు. వెంటనే ఈ పథకాన్ని పునరుద్ధరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. రజక సహకార సంఘాలను నూతనంగా ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం నిలుపుదల చేసిందనీ, ఈ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రజక వృత్తిదారులపై సామాజిక దాడులు అధికమవుతున్నాయని వాపోయారు. ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కోరారు. రాష్ట్రంలో క్రీడా మైదానాల పేరుతో రజక వృత్తిదారుల చాకిరేవు స్థలాలని ప్రభుత్వం తీసుకోవడం ఆపాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏండ్లు పైబడిన రజక వత్తిదారులందరికీ వృద్ధాప్య పింఛన్, డబుల్ బెడ్ రూమ్ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు సి.మల్లేశం, జ్యోతి ఉపేందర్, పాయిరాల రాములు, యం.బాలకృష్ణ, ఏదునురి మదార్, సుభద్ర ,చంద్రకళ, శోభ ,భాగ్య, కంచర్ల కూమరస్వామి, విజరు ,తదితరులు పాల్గొన్నారు.