Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములకు పట్టాలివ్వకపోతే ఉద్యమం తప్పదు
- మోడీ సర్కార్ విధానాలతో ఆగం
- సెప్టెంర్ 2నుంచి 5 వరకు ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ సమావేశాలు
- ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్(ఎఎఆర్ఎం)- తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) అనుబంధ జాతీయ సమావేశాలు, సెమినార్ సెప్టెంబర్ 2నుంచి 5 వరకు హైదరాబాదులో జరుగనున్నాయి. ఈ సమావేశాలకు 18 రాష్ట్రాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు.
ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా జూలకంటి ..
ఆహ్వానం సంఘం గౌరవ అధ్యక్షులుగా జీవన్‌లాల్ ఐఆర్ఎస్, అధ్యక్షులుగా మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్, కోశాధికారి ఎం.ధర్మ నాయక్‌తో పాటు మరో 75 మంది సభ్యులతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జూలకంటితో పాటు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ .లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వి.దాస్‌రామ్‌నాయక్. గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్. గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కొర్రా శరత్ . తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం శోభన్ నాయక్. టీజీఎస్్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు భూక్యా వీరభద్రం. ధీరావత్ రవి నాయక్, గుగులోత్ ధర్మ, యం బాలు నాయక్, శంకర్ నాయక్ తదితరులు మాట్లాడారు.
బరితెగించిన మోడీ సర్కారు..జూలకంటి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బరితెగించి హక్కుల్ని హరిస్తున్నదని జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన చట్టాలు, హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పారు. దేశంలో అటవీ సంపదను, అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే నూతన అటవీ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేస్తూ..చివరికి రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో విఫలమైందని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. రిజర్వేషన్లను పెంచకపోవడం వల్ల వారు విద్యా, ఉద్యోగ ,రాజకీయాల్లో తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడంతో ఉన్న రిజర్వేషన్లకే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోడు సాగుదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదనీ, ఈ పద్దతి మారాలని సర్కారుకు సూచించారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
పోడు సమస్యను పరిష్కరించాలి.. రాములు నాయక్..
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ జాతీయ సమావేశాల జయప్రదానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. గిరిజన రిజర్వేషన్లు, పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
సంస్కృతి ఆచారాలను దెబ్బతీస్తున్న బీజేపీ..వి దాస్‌రామ్ నాయక్..
బీజేపీి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదివాసీలు, గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, ఆహార అలవాట్లను కించపరుస్తూ దాడులు చేస్తూ హత్యలు చేస్తున్నదని ఎల్‌హెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వి దాస్‌రామ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు గిరిజనులు హిందూమతంలో భాగమని ప్రచారం చేస్తూ గిరిజనుల ఉనికికే ప్రమాదం వచ్చే విధంగా మతోన్మాద భావాలను బలవంతంగా రుద్దుతుందని విమర్శించారు.
భవిష్యత్ ఉద్యమాల కోసమే..శ్రీరాంనాయక్
ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్(ఆర్మ్) జాతీయ సమావేశాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటాలు తప్ప మరో మార్గం లేదని ఆర్ శ్రీరాంనాయక్ చెప్పారు. భవిష్యత్ ఉద్యమాల రూపకల్పన కోసమే జాతీయ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందులో వివిధ అంశాలపై తీర్మానాలను ఆమోదిస్తున్నట్లు పేర్కొన్నారు.