Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లర్ మెడకు చుట్టుకున్న కేంద్ర, రాష్ట్రాల లొల్లి
- మనోవేదనకుగురై కోనరావుపేట మిల్లర్ గుండెపోటుతో మృతి
- సీఎంఆర్ సేకరణకు ససేమిరా అంటున్న ఎఫ్‌సీఐ
- 45 రోజులుగా మిల్లులకు తాళాలు.. ఈఎమ్ఐలు కట్టక బ్యాంకుల ఒత్తిళ్లు
- నూకశాతం తగ్గించి, పోషక బియ్యం పట్టేందుకు అదనంగా మిషన్లు కొనుగోలు
- సార్టెక్స్, ఎఫ్ఆర్కే యంత్రాలకు రూ.70లక్షల వరకు అదనపు పెట్టుబడి
- పనుల్లేక అప్పుల ఊబిలోకి మిల్లు యజమానులు
- వర్షాలకు మొలకలొస్తున్న మిల్లులోని ధాన్యం కుప్పలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యం సేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ ముదిరిన వివాదం రైస్‌మిల్ ఇండిస్టీని అంపశయ్యపైకి నెట్టేస్తోంది. యాసంగి సీజన్ ఆరంభంలోనే బాయిల్డ్ బియ్యం తీసుకోబోమంటూ కొర్రీలు మొదలు పెట్టిన కేంద్రం పోషక విలువలున్న బియ్యం కావాలని నిబంధనలు పెట్టింది. దీంతో యాసంగి ధాన్యంలో నూకశాతం తగ్గించేందుకు, పోషక బియ్యం మరపట్టించేందుకు మిల్లర్లు అదనంగా సార్టెక్స్ మిషన్లకు రూ.60లక్షలు, ఎఫ్ఆర్కే మిషన్లకు రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. గొడవ సద్దుమణిగిందనుకున్న సమయంలో తాజాగా కేంద్రం మరో కొర్రీ పెట్టింది. రాష్ట్ర సర్కారు ఉచిత బియ్యం ఇవ్వలేదంటూ 45 రోజులుగా సీఎంఆర్‌ను నిలిపివేయగా ఆ పర్యవసానం నేరుగా మిల్లర్లపై పడింది. కొంత నష్టాన్ని భరించి అయినా యాసంగి ధాన్యాన్ని వేలం వేస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు ఇంకా తేల్చకపోగా.. మిల్లులో ధాన్యం కుప్పలు వర్షాలకు మొలకలు వస్తున్నాయి. మిల్లులు నడవక.. బ్యాంకుల్లో ఈఎమ్ఐలు, మిషన్ల నిర్వహణ భారంగా మారి మిల్లు యజమానులు అప్పుల్లోకి కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. అప్పులభారం భరించలేక రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మిల్లు యజమాని శనివారం గుండెపోటుతో మరణించాడు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.91,852 మంది రైతుల నుంచి సుమారు 11.2లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలోని 350 బాయిల్డ్ మిల్లులు, 320వరకు రా రైస్ మిల్లులు తమకు కేటాయించిన ధాన్యం లోడును దించుకున్నాయి. రా రైస్ మాత్రమే తీసుకుంటామని కేంద్రం తెగేసి చెప్పడంతో గత వానాకాలం సీజన్లోనే కొన్ని మిల్లులు రూ.60లక్షలు వెచ్చించి సార్టెక్స్ యంత్రాలను కొనుగోలు చేశాయి. ఇప్పుడు పోషక విలువలతో కూడిన బియ్యం ఇవ్వాలని చెప్పడంతో మరో రూ.10లక్షలు ఖర్చు చేసి మిల్లులో ఎఫ్ఆర్కే యంత్రాలను బిగించుకున్నారు.
మిల్లర్ మెడపైనే ధాన్యం..
వానాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యంలో 40లక్షల మెట్రిక్‌టన్నుల వరకు ఇంకా మిల్లుల్లోనే ఉండిపోయింది. ఆ ధాన్యమే మరపట్టిస్తుండగా.. తాజాగా యాసంగిలో సేకరించి 50లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం ఇప్పుడు మిల్లులకు చేరింది. అయిత,ే ఒకసారి రాష్ట్ర సర్కారు నుంచి ధాన్యం లోడ్‌ను మిల్లులో దింపుకున్నాక పూర్తి బాధ్యత మిల్లు యజమానిదే. ఈ నేపథ్యంలో వానాకాలం నుంచి మొన్నటి యాసంగి వరకు కేంద్రంలో ఎఫ్‌సీఐ సీఎంఆర్ సేకరణలో పెడుతున్న కొర్రీలతో మిల్లులు రెగ్యులర్‌గా నడవలేదు. పైగా యాసంగి సీజన్ ప్రారంభం నుంచి బాయిల్డ్ రైస్‌పై సాగిన రాద్ధాంతమూ మిల్లులు నడవకుండా మొకాలొడ్డింది. ఇప్పుడు రాష్ట్ర సర్కారు ఉచిత బియ్యం పంపిణీ చేయలేదన్న సాకుతో 45 రోజులుగా సీఎంఆర్ నిలిపివేసింది. ఇటీవలి వర్షాలకు మిల్లులోని ధాన్యం తడిసి మొలకలొస్తున్న నేపథ్యంలో ఆ నష్టం అంతా మిల్లర్‌పైనే పడుతోంది.
ధాన్యం వేలంపై తేల్చని రాష్ట్ర సర్కారు
కేంద్రం సీఎంఆర్ తీసుకోని పక్షంలో మిల్లుల్లోని ధాన్యాన్ని బహిరంగ వేలంలో కొంత నష్టానికి అయినా అమ్మి సమస్య పరిష్కరిస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు అందుకు ఓ కమిటీని వేసింది. తొలుత 10లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వేలం వేస్తామని ప్రకటించి ఈనెల 18లోగా తేల్చుతామని చెప్పినా విధివిధానాలు రూపొందించలేదు. మరోవైపు యాసంగి ప్రారంభంలోనే ధాన్యం కొనబోమని రాష్ట్ర సర్కారు చెప్పిన సమయంలో రైతుల నుంచి నేరుగా క్వింటా ధాన్యానికి రూ.1500వరకు చెల్లించి కొందామని మిల్లర్లు సిద్ధమయ్యారు. ఆ ధాన్యాన్ని మర ఆడించగా వచ్చే బాయిల్డ్ బియ్యాన్ని కాకినాడ పోర్టులో క్వింటా ధాన్యానికి పలుకుతున్న రూ.2600కు అమ్ముకుందామని భావించారు. తీరా రాష్ట్ర సర్కారు రూ.1960 మద్దతు ధరతో రైతుల నుంచి మొత్తం ధాన్యం కొని మిల్లుల్లో చేర్చింది. ఒకవైపు ఎఫ్‌సీఐ సీఎంఆర్ బంద్ చేయగా.. మరోవైపు రాష్ట్ర సర్కారు ఏదో ఒక ధరకు మిల్లులకు అమ్మక.. రాష్ట్ర వ్యాప్తంగా గత వానాకాలం, మొన్నటి యాసంగి ధాన్యం సుమారు 90లక్షల మెట్రిక్‌టన్నులు మిల్లర్ల మెడపైనే పడ్డాయి.
మిల్లు నడవక.. నిర్వహణ భారమై..
మిషన్లు నడిచినా నడవకున్నా.. ఆపరేటర్లు, గుమస్తాలను కాపాడుకునేందుకు కొందరు యజమానులు నెలకు రూ.లక్షన్నర వరకు భరిస్తూ జీతాల రూపేణా ఇస్తున్నారు. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు అప్పులు తెచ్చి ఈఎంఐలు కడుతున్నారు. ఇన్ని రోజులుగా మిషన్ నడవక విడిభాగాలన్నీ మరమ్మతుకు గురవుతున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాల హమాలీలు, కార్మికులకు సొంతూళ్లకు వెళ్లిపోగా.. ఉన్న ఆపరేటర్లు, ఇతర సిబ్బంది ప్రత్యామ్నాయ పనులకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఇన్నేండ్లుగా రైస్‌మిల్లు ఇండ్రస్టీని నమ్ముకున్న యజమానులు తీరని అప్పుల్లోకి కూరుకుపోతున్నారు.
రైస్‌మిల్లు ఇండిస్టీని ఆదుకోవాలి
వెంగల్దాస్ శ్రీనివాస్- రైస్‌మిల్లు యజమాని- సుల్తానాబాద్
ఇన్నేండ్లుగా ఇదే ఇండిస్టీని నమ్ముకుని బతుకుతున్నాం. ఎంతోమందికి ఉపాధి చూపుతున్నాం. నూకశాతం తగ్గించుకోవాలని, పోషక విలువల బియ్యం పట్టించాలని రూ.70లక్షల వరకు అప్పులు చేసి మిషనరీలు కొన్నాం. తీరా ఇప్పుడు కేంద్రం సీఎంఆర్ తీసుకోకపోవడం, రాష్ట్ర సర్కారు ధాన్యంపై ఏటూ తేల్చకపోవడం వల్ల తీవ్ర అప్పుల్లో కూరుకుపోతున్నాం.