Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిత్యావసర వస్తువులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోపిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జీఎస్టీ అనేది ఇప్పటికే రాష్ట్రాలను దెబ్బకొట్టిందని తెలిపారు. రాష్ట్రాలకున్న పన్ను అధికారాలను కేంద్రం లాగేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఇస్తామన్న నష్టపరిహారం సైతం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీమళ్లీ ధరలను పెంచేందుకు కేంద్రానికి జీఎస్టీ ఆయుధంగా మారిందని తెలిపారు. అందులో భాగంగానే ఇప్పుడు పాలు, పెరుగు, లస్సీ, ప్యాకెట్లలో అమ్మే బియ్యం, గోధుమలు, గోధుమపిండి, పప్పుధాన్యాలతోపాటు ఎల్ఈడీ బల్బులు వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం మోపిందని విమర్శించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.