Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కారుణ్య నియామకాలకు పెండ్లి కాని కుమార్తె సైతం అర్హురాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోదరుడు చనిపోవడంతో కారుణ్య నియామక పోస్టుకు శ్రీవాణి చేసుకున్న దరఖాస్తును గోదావరిఖని సింగరేణి కాలరీస్ అధికారులు తిరస్కరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివాహం కాని కుమార్తె సైతం కారుణ్య నియామకానికి అర్హురాలనీ, ఆమె దరఖాస్తును స్వీకరించి తగిన పోస్టులో ఆమెను నియమించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
డబ్బు డిపాజిట్ చేయండి
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని నాగాహిల్స్లో రోడ్డు వేసేందుకు పిటిషనర్ నుంచి తీసుకున్న భూమికి నిర్ణయించిన ధరలో సగం డబ్బును హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలని జీహెచ్ఎంసీకి చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌భూయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశించింది. తన స్థలానికి పరిహారం ఇవ్వాలన్న ఉత్తర్వులను జీహెచ్ఎంసీ అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని మహ్మద్ అలీ తరఫు న్యాయవాది చెప్పారు. అది ప్రభుత్వ పోరంబోకు స్థలమనీ, పిటిషనర్‌కు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ న్యాయవాది వాదించారు. జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ విచారణకు హాజరుకాలేదనీ, మరో అధికారి వచ్చారని తెలిపారు. ప్రభుత్వ భూమి అయితే భూసేకరణ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పరిహారం డబ్బులో సగాన్ని హైకోర్టులో డిపాజిట్ చేయాలనీ, వచ్చే నెల మూడో వారంలో తిరిగి విచారణ చేస్తామని బెంచ్ ప్రకటించింది.