Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ హాస్టళ్లలో బుర్రా వెంకటేశం ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. సోమవారం హైదరాబాద్ పరిధిలోని బీసీ బాలికల, బాలుర హాస్టళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేసారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలను సమీక్షించారు. విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకత బయటకు తీసీ.. వారికి ఆసక్తి ఉన్న రంగంలో రాణించేలా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఇటీవల నిర్వహించిన సమ్మర్ కార్నివాల్ ముగింపు వేడుకల్లో విద్యార్థులు విశేష్టమైన ప్రతిభను ప్రదర్శించారని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా ఆటల్లో, చిత్రలేఖనం, సంగీతం, రచనా మొదలైన లలిత కళల్లో శిక్షణ ఇస్తామనీ, ఆసక్తి గల వారు ముందుకొస్తే వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యం సాధించవచ్చని ఆయన సూచించారు. విద్యార్థులందరూ ఉన్నత ఆశయాలతో అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆయన సూచించారు. హాస్టల్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు గ్రంధాలయం, మోటివేషన్ పుస్తకాలు, ప్రోగ్రామ్ కావాలని అడిగారు. త్వరలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు పంపిస్తామని హామి ఇచ్చారు. హైదరాబాద్ డీసీడీఓ ఆశన్న, మేడ్చల్ డీసీడీఓ ఝాన్సీ పాల్గొన్నారు.