Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం : వాతావరణ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కొమ్రంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కూడా పడొచ్చని పేర్కొన్నారు. తెలంగాణ మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదనీ, దానికి అనుబంధంగా సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం నెలకొని ఉందని వివరించారు. అది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతిదిశ వైపుగా వంపు తిరిగి ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, అదే సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని సూచించింది. పశ్చిమ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు 257 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ(టీఎస్డీపీఎస్) వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతారామపట్నంలో అత్యధికంగా 54.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.