Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరదలతో ప్రజలకు తీరని నష్టం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రక్షించాలి : కొండా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'విదేశాల కుట్రల వల్ల క్లౌడ్ బరస్ట్ జరిగిందని సీఎం కేసీఆర్ అంటున్నడు. అది పాకిస్థాన్ వాళ్లు చేశారా? చైనావాళ్లు చేశారా? మిస్సైల్స్, రాకెట్ల ద్వారా చేశారా? విమానాల ద్వారా చేశారా? అనే దానిపై ఆయన స్పష్టతనివ్వాలి. మహారాష్ట్ర బార్డర్ నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో క్లౌడ్ సీడింగ్ చేయాలంటే 30 నుంచి 50 విమానాలు నిరంతరం పనిచేయాలి. అందుకు తగ్గట్టు విదేశీయులకు ఎయిర్ బేస్ ఉందా? ఇంతకీ ఆ సీక్రెట్ ఎయిర్ బేస్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉందా? తెలంగాణలో ఉందా? గజ్వేల్‌లో ఉందా? అనేది కనిపెట్టాలి. రా, ఎన్ఐఏ వంటి నిఘా సంస్థలకు తెలియకుండా వచ్చి ఆ దేశాలు ఇక్కడ బరస్ట్ చేస్తున్నాయా? అది చేసేవాళ్లకు తెలంగాణ అంటే ఇష్టం లేదా? భద్రాచలం దేవుడంటే ఇష్టం లేదా? మఖ్యమంత్రి అంటే ఇష్టం లేదా? అనేది కేసీఆర్‌నే చెప్పాలి' అని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్లౌడ్ బరస్ట్ అనేది ప్రకృతి సంబంధమైనదనీ, కేవలం క్లౌడ్ సీడింగ్ మానవులు చేయొచ్చని తెలిపారు. క్లౌడ్ బరస్ట్, క్లాడ్ సీడింగ్ గురించి ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎంలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.
ఆయన దగ్గర విదేశీ కుట్ర సమాచారం ఉంటే నిఘా సంస్థలకు చెప్పాలికదా అని ప్రశ్నించారు. క్లౌడ్ బరస్ట్ పశ్చిమ కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్యనే అయ్యే అవకాశం ఉందనీ, తెలంగాణలో ఒక్క వేసవిలో మాత్రమే అరుదుగా క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాలతో లక్షలాది మంది జీవితాలు ఆగమయ్యాయనీ, పార్టీలకతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను రక్షించాలని కోరారు. పంట నష్టాన్ని అంచనావేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి పంట నష్టం అందించారనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేసీఆర్‌ను కోరారు. గతంలో భద్రాచలానికి రూ100 కోట్లు అన్న కేసీఆర్.. ఇప్పుడు ఇంకో సున్నా పెంచి రూ.1000 కోట్లు ఇస్తానంటున్నాడనీ, అసలు ఆయన మాటల్లో విశ్వసనీయత ఉందా? అని ప్రశ్నించారు. క్లౌడ్ బరస్ట్ అనే అంశంతో దేశం చూపంతా తెలంగాణపై పడిందనీ, మన రాష్ట్రాన్ని, సీఎంని చూసి అందరూ నవ్వుకుంటున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ పెద్ద తప్పు అన్నారు. వరద జలాలు వృథా కాకుండా ఎత్తిపోయడానికే కట్టిన కాళేశ్వరం పంపుహౌజ్ మునిగితే దాని వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. కొండపోచమ్మ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. అది సగం నిండకముందే లీకేజీ అవుతున్నదని విమర్శించారు. రైతులెవ్వరూ బావిలో మోటార్లు మునిగిపోయేలా పెట్టుకోరనీ, జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతూ..పల్లా రాజేశ్వర్ రెడ్డి మాటల్ని ఖండించారు.