Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మైనార్టీల్లో నెలకొన్న పేదరికాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఇంతియాజ్‌తో కలిసి రుణాలపై మంత్రి చర్చించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీలను విద్యావంతులను చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున గురుకులాలు ప్రారంభించామని తెలిపారు. 60నుంచి 90శాతం సబ్సిడీపై రుణాలిస్తున్నామని తెలిపారు. లబ్దిదారుల ఎంపిక, రుణాల మంజూరుపై విధివిధానాలను ఖరారు చేస్తున్నామన్నారు. గతంలో 20నుంచి 30 శాతం మాత్రమే సబ్సిడీ ఇచ్చేవారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో సబ్సిడీపై రుణాలిచ్చే పద్ధతి దేశంలో మరెక్కడా లేదని స్పష్టం చేశారు. ఎస్సీల్లో మాదిరిగానే మైనార్టీల్లో కూడా పేదరికం ఎక్కువగా ఉందనీ, వారు చిన్నాచితక పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అర్హులైన వారికి స్వయం ఉపాధి కల్పించడం ద్వారా వారిలో ఆత్మస్తౖెెర్యాన్ని, గౌరవాన్ని పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. రుణాల మంజూరునకు ప్రస్తుతం రూ. 50కోట్లు కేటాయించామనీ, సీఎంను సంప్రదించి ఈ మొత్తాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు. సమావేశంలో మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్‌నదీమ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతివెస్లీ, జనరల్ మేనేజర్ యూనస్, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ మోహన్ దాసు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి చెందిన జె.భాస్కర సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.