Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నమనేని రమేష్‌పై టీఆర్ఎస్ గుస్సా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వేములవాడ నియోజవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయకపోవడంతో పలువిమర్శలు వస్తున్నాయి. ఆయనపై ఇప్పటికే ద్వంద్వ పౌరసత్వం ఉన్నదనే ఆరోపణలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటింగ్‌కు గైర్హాజరు కావడంతో ఆయన భారతీయ పౌరుడా? లేక జర్మన్ పౌరుడా? అనేది చర్చనీయాంశమవుతున్నది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసింది. ఈ ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని ఓటింగ్‌కు గైర్హజరు కావడంతో అధినేత గుస్సా అవుతున్నారు. ఆయన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ధృవపత్రాలు సమర్పించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే పదవి కోసం భారతీయుడినంటూ, వ్యాపారాల కోసం జర్మనీలో ఉంటున్నారంటూ విమర్శలొస్తున్నాయి. వైద్యపరీక్షల కోసం లండన్ వెళ్లిన ఎంఐఎం నేత అగ్బరుద్దీన్ హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకుని ఓటింగ్‌లో పాల్గొన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని మరి ఇక్కడే ఓటేశారు.
కరోనాతో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ కూడా ఓటింగ్ వచ్చేందుకు ప్రయత్నించారు. డాక్టర్ల సలహామేరకు దూరంగా ఉన్నారు. దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకునే క్రమంలో ఎమ్మెల్యే ఓటుకు ఎంతో విలువ ఉన్నప్పటికీ రమేష్ గైర్హాజరు కావడం పట్ల సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్టు ఆ వర్గాలు చెప్పాయి. రాష్ట్రపతి ఎన్నికలకు విప్ జారీ చేసే ప్రొవిజన్ లేకపోయినప్పటికీ పార్టీ నిర్ణయంమేరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే విధిగా ఓటింగ్‌లో పాల్గొనాల్సిందే. కానీ ఆయన మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు. ద్వంద్వ పౌరసత్వంపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ వేములవాడలో కనిపిస్తారనీ, మిగతా సమయమంతా విదేశాల్లో గడుపుతారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజరైన చెన్నమనేనిపై పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.