Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రౌపది ముర్ముకు ఓటేశారంటూ సీతక్కపై ప్రచారం
- వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని గైర్హాజరు
- కరోనాతో మంత్రి గంగుల ఓటింగ్‌కు దూరం
- తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ ఎమ్మెల్యే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నంలోపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 132 కాగా, మొత్తం 119 మంది శాసనసభ్యులున్నారు. అందులో ఇద్దరు సభ్యులు గైర్హజరయ్యారు. బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనాతో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచనమేరకు ఆయన ఓటింగ్ దూరంగా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీలో ఉండటంతో ఆయన ఓటింగ్‌కు హాజరు కాలేదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ మినహా మొత్తం 117 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించాంచిన సంగతి విధితమే. ఎంఐఎం మాత్రం ఎవరికి మద్దతిస్తామనేది మౌనంగానే ఓటేసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీజేపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తన ఓటును పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వినియోగించుకున్నారని ప్రచారం జరిగింది. ఓటేసే క్రమంతో బ్యాలెట్ పేపర్‌పై మార్కర్ గీత పడటంతో మరోక బ్యాలెట్ పేపర్ కావాలంటూ ఆమె ఎన్నిక అధికారిని కోరినట్టు తెలిసింది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల అధికారి దృష్టికి ఇక్కడికి అధికారులు తీసుకెళ్లగా మరోబ్యాలెట్ పేపర్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో అదే బ్యాలెట్ పేపర్‌ను సీతక్క బాక్స్‌లో వేశారు. దీంతో ఆమెకు సంబంధించిన సామాజిక తరగతికి(ఎస్టీ) చెందిన ద్రౌపది ముర్ముకు ఓటేశారనే ప్రచారం కొనసాగింది. దీనిపై సీతక్క వివరణ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటేయడానికి చివరి వరకు వస్తారా? రారా? అనే పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకూ ఆయనా చివరకు ఓటేశారు. ఓటేసేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌తో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సెల్ఫీలు దిగేందుకు తెగ ఉత్సాహం చూపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘనందన్‌రావు ఎన్నికల దగ్గర ఎడమొహం, పెడమొహంగా ఉన్నట్టు కనిపించింది. వారు వేర్వేరుగా వచ్చి ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుకూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మాగుంట మహీధర్‌రెడ్డి అత్యవసర పని మీద హైదరాబాద్ వచ్చారు. అమరావతికి వెళ్లి ఓటేసే సమయం లేకపోవడంతో ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణ అసెంబ్లీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు హనుమంత్‌షిండే, అల వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌కు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, బీజేపీకి ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఏజెంట్లుగా వ్యవహరించారు.
నా నిబద్ధతను శంకించొద్ద్దు...సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తా: సీతక్క
తమ పార్టీ సూచించిన రాష్ట్రపతి అభ్యర్థికి కాకుండా తాను బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్టు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం సేవ చేస్తున్నాననీ, తన నిబద్ధతను శంకించొద్దని కోరారు. తాను సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తానని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థకి ఓటు వేసినట్టు వస్తున్న ఆరోపణలపై ట్విటర్ ద్వారా సీతక్క వివరణ ఇచ్చారు. ఎలాంటి తప్పులు దొర్లలేదనీ, బ్యాలెట్ పేపర్‌పై ఇంక్ పడటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమని కోరితే ఇవ్వలేదనీ, ఇంక్ పడిన పేపర్‌నే బాక్స్‌లో వేసినట్టు వివరించారు. ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేసినట్టు చెప్పారు.