Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల రాస్తారోకో
నవతెలంగాణ - జైనూర్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే సాగు పెట్టుబడి రైతుబంధు డబ్బుల్లో కోత విధించి వడ్డీకి కింద జమ చేసుకోవడాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్-కుమురంభీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల రైతులు ఎస్బీఐ బ్యాంకు వద్ద ప్రధాన రహదారిపై బైటాయించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా గౌరవాధ్యక్షుడు షేకు పటేల్ మాట్లాడుతూ.. రైతుబంధు డబ్బులను రైతులకు తెలియకుండా బ్యాంకర్లు తగ్గించి ఇవ్వడం అన్యాయమన్నారు. విషయం తెలసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కనక యాదవరావు ఘటనా స్థలానికి చేరుకొని ఎస్బీఐ మేనేజర్ గోపాలకృష్ణతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే.. రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి వడ్డీ ఉన్న వారి డబ్బులు మాత్రమే కట్ చేస్తున్నామని బ్యాంక్ మేనేజర్ చెప్పారు. రైతుల డిమాండ్ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. బ్లాక్ చేసిన వారి ఖాతాలు క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.