Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బకాయిలు వెంటనే చెల్లించాలి: వేజ్ బోర్డు సభ్యుడు మందా నరసింహారావు డిమాండ్
- సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
- 20 నుంచి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడి నిరవధిక నిరాహార దీక్ష
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఖజానాను దోచుకుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేజ్ బోర్డు సభ్యుడు మంద నరసింహారావు అన్నారు. సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.22వేల కోట్లను తక్షణమే సింగరేణి సంస్థకు చెల్లించాలని డిమాండ్ చేశారు. వరద బాధితులను రక్షించేందుకు వెళ్లి ప్రాణం కోల్పోయిన రెస్క్యూ సిబ్బంది సతీష్, రాము కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులందరికీ సొంతింటి పథకం అమలు చేయాలని, 250గజాల స్థలం కేటాయించాలని, కార్మికుడికి కేటాయించిన క్వార్టర్‌ను వారికే ఇవ్వాలన్న తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 20నుంచి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సొంతింటి పథకం అమలయ్యే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్జీ1 అధ్యక్ష, కార్యదర్శులు మేదరి సారయ్య, మెండె శ్రీనివాస్, అర్జీ2 కార్యదర్శి ఉల్లి మొగిలి, ఎంనరసయ్య, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, నాయకులు సీహెచ్.వేణుగోపాల్‌రెడ్డి, ఆరెపల్లి రాజమౌళి, జె.గజేంద్ర, పి.రాజేశ్వరచారి, అన్నం శ్రీనివాస్, నంది నారాయణ, జె.మల్లేష్, మామిడి మల్లయ్య, ఎస్.రాజయ్య, దేవేందర్ పాల్గొన్నారు.