Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధప్రాతిపదికన కరకట్ట ఎత్తు పెంచి, పొడగించాలి
- ఒక్కో ముంపు కుటుంబానికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలి
- వరద బాధితులకు అండగా సీపీఐ (ఎం)
- భద్రాచలం డివిషన్లో ముంపు బాధితులను పరామర్శించిన సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తేనే భద్రాద్రికి రక్షణ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బురద, మట్టిని తొలగించేందుకు ఒక్కో ముంపు బాధిత కుటుంబానికి రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంతో పాటు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన సోమవారం పర్యటించి ముంపు బాధితులను పరామర్శించారు. భద్రాచలంలో పర్యటించిన అనంతరం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. పోలవరం ఎత్తు తగ్గించాలని తమ పార్టీ ఎప్పటి నుంచో పోరాటాలు నిర్వహిస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో బ్యాక్ వాటర్ ఎఫెక్ట్‌తో భద్రాచలం పట్టణం నీట మునిగిందన్నారు. ఇక పోలవరం పూర్తయితే భద్రాచలం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. భద్రాచలం పట్టణంలో యుద్ధప్రాతిపదికన కరకట్టల ఎత్తు పెంచి వాటిని పటిష్టపరచాల న్నారు. భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీలో 300 మీటర్ల వరకు కరకట్ట ఎత్తు పెంచి ఉంటే అసలు నీళ్లు వచ్చే అవకాశం ఉండేది కాదన్నారు. డంపింగ్ యార్డ్కే స్థలం లేని భద్రాచలంలో ఎత్తయిన ప్రదేశంలో శాశ్వత కాలనీలకు స్థలం ఎక్కడ లభిస్తుందని ప్రశ్నించారు. అయ్యప్ప కాలనీలో స్లూయిస్ లీక్ కావటంతో ఇండ్లన్నీ జలమయమయ్యాయని తెలిపారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు ఇంటింటికి వెళ్లి నష్టపరిహారాన్ని నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రకటించిన రూ.పది వేలు బురద, మట్టి కనుక్కోవడానికి కూడా సరిపోవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధిత ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం చేయాలని కోరారు. భద్రాచలం పట్టణానికి సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన రూ.100 కోట్ల లాగా శుష్క హామీ కాకుండా ప్రకటించిన విధంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలన్నారు. భద్రాచలంకు చెందిన 5 గ్రామ పంచాయతీలను ఆంధ్రాలో విలీనంపై గతంలో సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని, ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు మరిచారని ప్రశ్నించారు. స్థానికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించిన సీపీఐ(ఎం) నాయకుల నోరు నొక్కి అరెస్టులు చేయించటం దారుణమన్నారు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. సీఎం భద్రాచలం రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలను కొంతమందిని పునరావాస కేంద్రాల వద్ద ఉంచి అంతా బాగానే ఉందని చెప్పిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఇది నిదర్శనమన్నారు. స్థానిక మంత్రి పువ్వాడ వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా అరెస్టులు చేయించటం ఎంత వరకు సమంజసమన్నారు. భద్రాచలం వరద బాధితులను ఆదుకోవడంలో అధికారుల సమన్వయ లోపం స్పష్టం అయింది అన్నారు. మోటార్లు పెట్టినప్పటికీ నీటిని మళ్లించే ప్రయత్నం బెడిసికొట్టడంతోనే భద్రాచలం పట్టణంలోని కొన్ని కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. బండారు చందర్రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలంలో వరద బాధితులకు, దుమ్ముగూడెం మండలంలో యలమంచిలి సీతారామయ్య జ్ఞాపకార్థం వరద బాధితులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బ్రహ్మచారి, ఎంబీ నర్సారెడ్డి, గడ్డం స్వామి, జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మ సాగర్‌తో ముప్పు
సీతమ్మ సాగర్‌తో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 7,500 ఎకరాల లంకభూములకు ముప్పు ఏర్పడుతుందని స్థానికులు తమ్మినేని దృష్టికి తీసుకొచ్చారు. గోదావరి వరదలతో తాము తీరని నష్టాలను చవిచూశామని వాపోయారు. గోదావరి ధాటికి ఇండ్లు దెబ్బతిన్న బాధితులను పరామర్శించారు. వరదలతో సర్వం కోల్పోవటం బాధాకరమన్నారు. వరద బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు చేపడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. వరద బాధితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాన్నారు. చర్ల మండలంలో ఏడు గ్రామాల నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. దుమ్ముగూడెం మండలంలో నాలుగు ముంపు గ్రామాలను సందర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రామాలయం పరిసరాల్లో నీరు బాగా ఉండటంతో తెప్పపై వెళ్లి దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు.