Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యఅతిధిగా గవర్నర్ తమిళిసై
- హెచ్ఆర్సీ చైర్మెన్ జి చంద్రయ్యకు గౌరవ డాక్టరేట్
- 19 కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నాం
- దసరాకు బాచుపల్లిలో విశ్వవిద్యాలయం ప్రారంభం :
- ఉపకులపతి తంగెడ కిషన్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (పీఎస్టీయూ) 15వ స్నాతకోత్సవం బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనుంది. ముఖ్యఅతిధిగా వర్సిటీల చాన్సలర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరవుతారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ ఈ వర్సిటీ స్థాపించి 37 ఏండ్లయ్యిందని చెప్పారు. కరోనా నేపథ్యంలో నాలుగేండ్ల తర్వాత బుధవారం స్నాతకోత్సవం జరుగుతున్నదని వివరించారు. అయితే ఈ నాలుగేండ్లలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులందరికీ వాటిని అందజేస్తామన్నారు. ఎంఫిల్ 21 మంది, పీహెచ్డీ 73 మందికి పట్టాలిస్తామని అన్నారు. పీహెచ్డీ 43 మంది, ఎంఫిల్ 17 మంది, పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసిన వారు 52 మంది కలిపి 112 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ఇస్తామని చెప్పారు. ఈ స్నాతకోత్సవంలో డీలిట్ (గౌరవ డాక్టరేట్)ను మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మెన్ జస్టిస్ జి చంద్రయ్యకు ఇస్తామని వివరించారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ స్నాతకోత్సవాన్ని నిర్వహించడం విశేషమన్నారు. అయితే ఎన్టీఆర్‌ను స్మరిస్తూ విద్యార్థులతో ప్రత్యేకంగా ఒక రోజు ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 19 కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని వివరించారు. డిజైన్, లైబ్రరీ సైన్స్, యోగా వంటి కోర్సులను విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. సాహిత్య, కళారంగాల్లో నిష్ణాతులైన 70 మందికి ఏటా పురస్కారాలు అందజేస్తున్నామని అన్నారు. వందెకరాల్లో హైదరాబాద్‌లోని బాచుపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణాన్ని దసరాకు ప్రారంభోత్సవం చేస్తామన్నారు. పీజీ తరగతులను అక్కడ నిర్వహిస్తామని చెప్పారు. 150 మంది అమ్మాయిలకు, 300 మంది అబ్బాయిలకు హాస్టల్ సౌకర్యం ఉందన్నారు. యూజీ, సర్టిఫికెట్, దూరవిద్య కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నాంపల్లి ప్రాంగణంలోనే తరగతులుంటాయని వివరించారు. నాంపల్లి నుంచి బాచుపల్లికి వెళ్లాలంటే తొలుత కొన్ని ఇబ్బందులుంటాయనీ, తర్వాత అవే సర్దుకుంటాయని అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) తొలుత నాంపల్లిలోని గోల్డెన్ త్రెషోల్డ్లో ఉండేదనీ, ఇప్పుడు గచ్చిబౌలి దానికి ప్రధాన కేంద్రంగా మారిందని గుర్తు చేశారు. వర్సిటీలో 42 బోధన, 40 వరకు బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ అవుతాయని అన్నారు. 19 కొత్త కోర్సులను బోధించేందుకు గెస్ట్ ప్యాకల్టీని నియమిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ భట్టు రమేష్, పరీక్షల నియంత్రణాధికారి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.