Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
- పీఎఫ్, ఇతర అలవెన్స్లూ ఇవ్వాలి
- ఆశా కార్యకర్తల డిమాండ్
- కలెక్టరేట్ల ఎదుట ధర్నా
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
''మాకూ ఫిక్స్డ్ వేతనం ఇవ్వండి.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు ఇక్కడా అమలు చేయండి.. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి.. కనీస వేతనాలు అమలు చేయాలి. మా సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించినా పాలకులు గుర్తించడం లేదు. ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యం కల్పించాలి'' అంటూ ఆశా కార్యకర్తలు నినదించారు. సోమవారం ఆలిండియా డిమాండ్స్ డే సందర్భంగా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు తీసి.. కలెక్టరేట్ల ఎదుట పెద్దఎత్తున ధర్నా చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2022 మే 22న దేశంలో పని చేస్తున్న పది లక్షల మంది ఆశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు అందించిందని నేతలు చెప్పారు. 2013 సంవత్సరంలో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చేసిన సిఫారసుల ప్రకారం ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్సు 16 నెలల బకాయిలని వెంటనే చెల్లించాలన్నారు. 32 రకాల రిజిష్టర్లను ప్రభుత్వమే ప్రింట్ చేసి సప్లరు చేయాలని, ఈ లోపు రిజిష్టర్ల కోసం ఆశావర్కర్లు పెట్టిన ఖర్చును చెల్లించాలని కోరారు.
అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత చెప్పారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట పాల కేంద్రం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ, ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. 2021జులై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ఏవోకి వినతిపత్రం అందజేశారు.
రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. పలు డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ.. 'సర్కారు మా గోడు విని తక్షణమే సమస్యలు పరిక్షరించాలి' అని నినాదాలు చేశారు. అనంతరం డీఎంహెచ్వో ఆఫీస్ ముట్టిడించి.. ఆఫీసర్లు బయటికి వెళ్లకుండా ఘెరావ్ చేయడంతో.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి వెంటనే బయటకు వచ్చారు. ఆమెకు ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేశారు. అందుకు స్పందించిన డీఎంహెచ్వో.. తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ప్రయత్నం చేస్తానని హామీనిచ్చారు. వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది నుంచి వచ్చే ఒత్తిళ్లపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీహెచ్సీ కేంద్రాల్లో ఆశలకు ప్రత్యేక గదితో పాటు.. మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆశాలు పెద్దఎత్తున కలెక్టరేట్లకు తరలివచ్చి ధర్నా చేశారు.