Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదలైన కేంద్రం వడ్డన
- ఇం'ధన' ధరల పెంపుతో ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు
- డెయిరీ, ఇతర ఆహార ద్రవ పదార్థాలపై 18శాతం జీఎస్టీ
- ఆస్పత్రుల గదులనూ వదలని కేంద్రం.. 12శాతం పన్ను
- ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ొ కేంద్రం తీరుపై విపక్షాల ఆగ్రహం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ప్యాక్ చేసి.. లేబుల్ వేస్తే సరి.. ఏ ఆహారపదార్థమైనా ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి వచ్చింది. జూన్ 28, 29తేదీల్లో జరిగిన గూడ్స్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) మండలి 47వ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో పాల ప్యాకెట్లు మొదలుకుని తాగే ఏ ఆహార ద్రవ పదర్థాలైనా ఇప్పుడు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరల పెంపుతో రవాణాచార్జీలు పెరిగి పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిన నేపథ్యంలో కేంద్రం తినే తిండిపైనా పన్నులు వసూలు చేస్తున్నది. ఇదంతా ఒకెత్తయితే.. రోగమొచ్చి ఆస్పత్రిలో చేరితే రోగి ఉండే గదులపైనా పన్నులు వసూలు చేయడం దారుణం. కరోనా మహమ్మారితో పేద, మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థ కుదేలైన పరిస్థితిలో వంటగ్యాస్ మొదలుకుని అన్నింటిపైనా రాయితీలు ఎత్తేసి బాదేస్తోంది. ధరలతో జనం బెంబెలెత్తుతున్న నేపథ్యంలో 'నవతెలంగాణ' పలువురు జనం అభిప్రాయాలను తెలుసుకుంది.
కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు వాహన షోరూమ్‌లో సెక్యూరిటీగా పని చేస్తున్న ప్రభాకర్‌కు నెల జీతం రూ.8వేలు మాత్రమే. అదీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ నేపథ్యంలో ఇప్పుడున్న 8గంటల డ్యూటీని కాస్త 12గంటలకు పెంచారు. రోజంతా పని చేసినా వచ్చే అరకొర జీతంలో పెరిగిన ఉప్పులు, పప్పులు, వంటగ్యాస్.. కుటుంబ అవసరాలకే సరిపోతుండగా.. ఇప్పుడు ఆహారపదార్థాలపైనా పన్నులు పెంచితే ఎలా బతికేది అంటూ వాపోయాడు. ఇంటిల్లిపాది పని చేసినా రూ.15వేల నుంచి రూ.20వేలు దాటని ఆదాయంతో ఇంటి అద్దె, రోజువారీ అవసరాలు పాలు, కూరగాయలు, ఇతర ఖర్చులతో బతుకు బండిని భారంగా లాగుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఒక్క ప్రభాకర్ పరిస్థితియే కాదు.. నెలవారీ వేతనాలు రూ.10వేల నుంచి రూ.15వేలకు మించి ఆదాయం రాని పేద, మధ్యతరగతి కుటుంబాల్లో కేంద్రం పెడుతున్న ధరల చిచ్చు.
డెయిరీ సహా ప్యాకింగ్‌లో అమ్మే తినే పదార్థాలపై పన్ను
ప్రధానంగా నిత్యావసర సరుకుల్లో రోజువారీగా తాగే పాల ప్యాకెట్లపైనా జీఎస్టీ భారం పడనుంది. ప్రస్తుతం అన్ని రకాల డెయిరీ ఉత్పత్తుల్లో పాలప్యాకెట్ అర లీటర్‌పై రూ.34 నుంచి రూ.36వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం విధించిన 5శాతం పన్నుతో అదనంగా రూ.2 నుంచి రూ.3 పెరగనుంది. పెరుగు, లస్సీ సమా, బ్రాండ్ పేరుతో ప్యాకెట్లలో అమ్మే బియ్యం, గోధుమలు, గోధుమపిండి, పప్పుధాన్యాలు, ఇలా 25 కిలోలు లేదా 25 లీటర్లకు మించి ఒకే ప్యాకింగ్ ఉన్నట్టుయితే అవి ప్రీ ప్యాకేజ్డ్ అండ్ లేబుల్డ్ కేటరిగిరీ కిందకు రావని కేంద్ర ఆర్థికశాఖ చెబుతోంది. అయితే, ఇప్పుడు వాటితో సహా ద్రవ పానియాలు, డెయిరీ ఉత్పత్తులను ప్యాక్ చేయడానికి ఉపయోగించే టెట్రాప్యాక్ (అసెస్టిక్ ప్యాకేజింగ్ పేపర్) మీద జీఎస్టీని 12శాతం నుంచి 18శాతానికి పెంచారు. అంటే టెట్రా ప్యాకుల్లో కొనే పాలు, పెరుగుల్లాంటివి ఇక ముందు ప్రియం కానున్నాయి. ఇక మాములుగా పెరుగు, లస్సీ, మరమరాలు వంటి ఇతర సరుకులను కూడా ప్యాక్ చేసి, లేబుల్ వేస్తే వాటిపైనా 5శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇప్పటికే ఇం'ధన' ధరలు పెరిగి నిత్యావసర సరుకుల రవాణా ఖర్చులు పెరిగాయి. ఫలితంగా వాటి ధరలూ పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తినే పదార్థాలపైనా జీఎస్టీ బాదితే ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మరింత ప్రియంకానున్న ఆస్పత్రి గదులు, హోటల్‌రూమ్‌లు
రూ.1,000 వరకు ఉన్న హోటల్ గదుల అద్దెల మీద ఇప్పుడు 12 శాతం జీఎస్టీ విధించారు. ఇది ఇతర ప్రాంతాల్లో ప్రయాణం చేసే ఉద్యోగులు, వ్యాపారస్తులపై భారం పడుతుంది. రోగాలు వస్తే మాత్రం పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ఆస్పత్రుల్లో చేరుతారు. ఇప్పుడు సాధారణంగా విషజ్వరాలు, ఇతర రోగాల బారిన పడి ప్రయివేటు ఆస్పత్రిలో చేరితే ఐసీయూ మినహా మిగతా రోగి గదిపైనా కేంద్రం జీఎస్టీ బాదింది. ప్రస్తుతం రోజుకు రూ.5వేలు ఉండే రోగి అద్దెగదులపై 5శాతం పన్ను విధించింది. అంటే అదనంగా రూ.250వరకు పన్ను పడుతుండగా.. ఇదే అదనుగా ప్రయివేటు ఆస్పత్రుల్లో గదుల అద్దె ధరలూ పెంచే ఆలోచనలో ఆయా హాస్పిటల్ యాజమాన్యాలు ఉన్నాయి. ఇలా సామాన్యుడిపై భారం పడేలా కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనగా.. విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం
వాసుదేవరెడ్డి- సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి
ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరలను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. తినే తిండినీ వదలకుండా జీఎస్టీ బాధడం బాధాకరం. వంటగ్యాస్ మొదలుకుని ఉప్పు, పప్పుల ధరలు పెరిగి బతుకు జీవుడా అన్న చందంగా మారిన పేద, మధ్యతరగతి ప్రజల్లో తీవ్ర ఆర్థిక అసమానతలు పెరిగే అవకాశం ఉంది.