Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెలుగుచూస్తున్న డెంగ్యూ జ్వరాలు
- గతేడాది 365 కేసులు నమోదైతే.. ఈ ఏడాది జులై 16వరకు 92 కేసులు
- 2010నాటి పరిస్థితులు పునరావృతమయ్యే ప్రమాదం
- ఇటీవలి వర్షాలు, ముసురుతో వృద్ధి చెందిన దోమలు
- శివారు కాలనీలు, పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం
- ప్రయివేటు ఆస్పత్రుల్లో 'డెంగీ' పేరిట వ్యాపారం
- కరీంనగర్, జగిత్యాల ప్రభుత్వాస్పత్రుల్లోనే వ్యాధి నిర్ధారణ యంత్రాలు
నవతెలంగాణ- కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ కరీంనగర్
వారం రోజులు కురిసిన వర్షాలకు తోడు వీడవకుండా పడుతున్న ముసురుతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దాంతో 'చాపకింద నీరులా' డెంగీ ప్రబలుతోంది. జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ వ్యాప్తికీ అనుకూలించేందుకు మున్ముందు ఆగస్టు, సెప్టెంబర్‌లో మరిన్ని వర్షాలు తోడవనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతేడాది 365 డెంగ్యూ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ ఏడాది జులై 16నాటికి 92పైనే కేసులు నమోదైనట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే, వ్యాధి నిర్ధారిచేందుకు ఎలీసా రక్తపరీక్షా కేంద్రాలు కరీంనగర్, జగిత్యాల ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉండగా.. ప్రయివేటులో లేనిపరీక్షలు చేసి డెంగ్యూ బూచీని చూపుతూ అడ్డగోలు వసూళ్లకు తెరతీస్తున్నారు.
మున్ముందు పరిస్థితి తీవ్రం..
వర్షాలు కురుస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి మురుగు గుంతులు ఏర్పడ్డాయి. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. దోమలు దండయాత్ర చేస్తున్నాయి. మున్ముందు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. అప్పుడు దోమలు వృద్ధి చెంది వైరస్ వ్యాప్తికీ అనుకూలిస్తుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు వంటి విషజ్వరాలే కాకుండా.. కలుషిత నీటితో వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్ తదితర వ్యాధులూ విజృంభించే ప్రమాదం ఉంది. కామెర్లు, టైఫాయిడ్ తదితర వ్యాధులూ విజృంభించనున్నాయి. వీటితోపాటు ఏటా సెప్టెంబర్ నుంచి మార్చి వరకూ కబళించే స్వైన్‌ఫ్ల్యూ పొంచి ఉంది. వీటికితోడు కొవిడ్ ఉధృతి మొదలైతే.. ప్రజారోగ్యం అతలాకుతలమయ్యే పరిస్థి తులు ఉన్నాయన్న ఆందో ళన వ్యక్త మవుతోంది.
పరిస్థితి విషమిస్తే..
రక్తం నుంచి పదార్థాలను విడగొట్టే అత్యాధునిక పరికరాన్ని వైద్య పరిభాషలో 'హెవీ డ్యూటీ కూలింగ్ సెంట్రీ ప్యూజ్ మిషన్' అంటారు. దీని ద్వారానే ప్లేట్లెట్లను విడ గొడతారు. అయితే ఇది హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ, వరంగల్‌లోని ఎంజీఎం తదితర మెడికల్ కాలేజీలున్న ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధానాస్పత్రి, జగిత్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాలను రూ.15కోట్ల మేర ఖర్చు చేసి ప్రభుత్వం ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసింది.
ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క ప్రయివేటు ఆస్పత్రిలోనూ, డయాగస్టిక్ సెంటర్లలోనూ డెంగ్యూనిర్ధారణ పరిక రాలు లేవు. సాధారణంగా ఆరోగ్య వంతుడి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4లక్షల వరకూ ఉంటుంది. డెంగ్యూ రోగులకు ఎప్పుడైతే ప్లేట్లెట్ల సంఖ్య బాగా పడి పోతుందో.. అప్పటి నుంచి ప్రయివేటు ఆస్ప త్రుల్లో రోగులను భయ పెట్టే పర్వం ప్రారంభ మవుతుంది. ఐసీయూ చికిత్స, గంటకోసారి పరీక్షలు, హడావిడిగా ప్లేట్లెట్లు ఎక్కిం చడంతో కనీసం రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకూ చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు వాపోతున్నారు.
డెంగీ లక్షణాలివే..
తీవ్ర జ్వరం వస్తుంది. 104 డిగ్రీల జ్వరం రావడంతోపాటు చలి వణికిస్తుంది. ఒళ్లు నొప్పలతో పాటు కండరాల నొప్పులు అధికంగా ఉంటాయి. రోగి నీరసించడమే కాకుండా విపరీతమైన తలనొప్పి వస్తుంది. కీళ్ల నొప్పులతోపాటు వాపు వస్తుంది. చర్మంపై దద్దుర్లు వచ్చి దురద ఉంటుంది. ఆకలి మందగిస్తుంది. వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. శోషగ్రంధుల వాపు, గొంతు, చంకల కింద నరాలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. ప్లేట్ లెట్స్ సంఖ్య భారీగా పడిపోతుంది. సాధారణ వ్యక్తికి 1.50లక్షల నుంచి 4లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి. డెంగ్యూ బాధితుల్లో వేలలో పడిపోతుంటాయి. మొదటి దశలో జ్వరం, కండారల నొప్పులు, వాంతులు, తల నొప్పి ఉంటాయి. రెండవ దశలో చిన్న చిన్న దద్దుర్లు శరీరంపై కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం తలనొప్పి, నడుంనొప్పి. వాంతులు, కడుపునొప్పి తదితర లక్షణాలతో పాటు ప్లేట్ లెట్స్ కణాల సంఖ్య తగ్గుతుంది. మూడో దశలో మొదటి రెండు దశలు తీవ్రమై రక్త పోటు తగ్గడం, ప్లేట్ లెట్స్ సంఖ్య మరింత పడిపోతుంది. లక్షల్లో ఉండాల్సిన ప్లేట్ లెట్స్ వేలల్లోకి పడిపోతాయి.
వైద్యులను అప్రమత్తం చేశాం
సీజనల్ వ్యాధులు విజృంభించకముందే వైద్యాధికారులను అప్రమత్తం చేశాం. వైద్యా ధికారులతో ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పి స్తున్నాం. ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వ హిస్తున్నాం. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో డెంగ్యూ (ఎలిసా) నిర్ధారణ కేంద్రం ఉంది. అక్కడ పరీక్ష చేసి నిర్ధారిస్తేనే డెంగ్యూ కేసుగా పరగణిస్తాం. ప్రయివేటులో చేసే పరీక్షలు డెంగ్యూగా గుర్తించం. అంటువ్యాధులపై ప్రజల్లో విరివిగా అవగాహన పెంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. గ్రామాల్లో జ్వరాలపై సర్వే పక్కాగా చేపట్టాలని ఆదేశించాం.
డాక్టర్ జువేరియా - కరీంనగర్ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి