Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలతో ఫీజుల ఖరారుపై సంప్రదింపుల ప్రక్రియ వచ్చేనెల ఒకటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు టీఏఎఫ్ఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ ఆపీసర్ రామారావు మంగళవారం షెడ్యూల్‌ను జారీ చేశారు. కాలేజీలతో వచ్చేనెల మూడో తేదీ వరకు సంప్రదింపులుంటాయని తెలిపారు. రోజుకి 40 కాలేజీల చొప్పున హాజరు కావాలంటూ ఆయన ఆదేశించారు. ఇక ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు వచ్చేనెల పది నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. రోజుకు 50 కాలేజీల యాజమాన్యాలు హాజరు కావాలంటూ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రంలోని ఆర్కిటెక్చర్ కాలేజీ యాజమాన్యాలతో సంప్రదింపులు వచ్చేనెల మూడున ఉంటాయని తెలిపారు.
పూర్తిగా పరిశీలించాలి : టీఎస్టీసీఈఏ
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, వారికి నాణ్యమైన విద్యను అందించే విధంగా టీఏఎఫ్ఆర్సీ చర్యలు తీసుకోవాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ టీఏఎఫ్ఆర్సీని కోరారు. ఆయా కాలేజీల్లో అధ్యాపకులున్నారో లేదో పూర్తిగా పరిశీలించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఆయా కాలేజీల్లో ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలను సకాలంలో ఇస్తున్నారో లేదో చూడాలని తెలిపారు. విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయో? లేదో? పరిశీలించాలని పేర్కొన్నారు. ఫార్మసీ కళాశాలల్లో కరోనా కాలంలో పెండింగ్‌లో ఉన్న జీతాలను ఉద్యోగులకు ఇప్పటికీ చెల్లించడం లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులకివ్వాల్సిన జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇలా అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించి ఫీజులను ఖరారు చేయాలని కోరారు.