Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూక్ష్మ పరిశీలన.. లోతైన విశ్లేషణ
- సీఎం కేసీఆర్ సొంతం: బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూక్ష్మ పరిశీలన లోతైన విశ్లేషణ సీఎం కేసీఆర్ సొంతమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమెరికా కొలంబియా యూనివర్సిటీ ప్రముఖ ఆర్థికవేత్త, సీజీస్ సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్డీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అంశంపై కేసీఆర్‌కు పక్కా విజన్ ఉంటుందనీ, దాంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందనీ, ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీటి ఆయోగ్ సంస్థ పలుమార్లు కితాబు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యమని, విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో ఉద్యమించిన టిఆర్ఎస్ పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నినాదాన్ని వాస్తవ రూపంలో అమలు చేసి చూపిందని వివరించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. అర్థ గణాంక శాఖ ఆధ్వర్యలో ముద్రించిన '' తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2022 '' డేటా బుక్ , పిడుగు ప్రమాదం నుంచి సురక్షితంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీఎస్ డీపీిఎస్ సంస్థ ముద్రించిన వాల్ పోస్టర్ ను, '' వెదర్ అండ్ క్లైమాతోలాజి ఆఫ్ తెలంగాణ '' పబ్లికేషన్‌ను ఈ సందర్బంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీజీస్ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ గవర్నెన్స్ ఫెలోస్ (కేజీఎఫ్) ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్థిక, స్త్రీ శిశు సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు సహా పాలు ఇతర శాఖలు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రగతి నివేదికపై కె రామకృష్ణారావుతో కలిసి విశ్లేషించి, ఆయా రంగాల ప్రగతి పురోగతి సర్వే నివేదికలను పరిశీలించారు. సీజీస్ సంస్థ ఫౌండర్ కార్తిక్ మురళీధరన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగా, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి రోనాల్డ్ రోస్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, టీఎస్‌డీపీఎస్. సంస్థ ఈవో రామకృష్ణ, శివ కుమార్, ప్రసాద్, ప్రముఖ వాతావరణవేత్త డాక్టర్ వై.వీ రామారావు, తదితరులు పాల్గొన్నారు.