Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యార్థుల చదువులపై జీఎస్టీ పేరుతో భారాలు మోపడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తీవ్రంగా ఖండించింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ, భారాలను ఎత్తేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు వాడే పెన్సిల్, ఇంకు, షార్ప్నర్, రైటింగ్, డ్రాయింగ్, ప్రింటింగ్ మెటీరియల్, పేపర్లపై 12 శాతం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, చార్ట్, మ్యాప్ పేపర్లు, గ్రాఫ్ పేపర్లు, ఎక్సరరైజ్ నోట్ పుస్తకాలు, వర్క్ పుస్తకాలపై 18 శాతం జీఎస్టీ విధించడంతో విద్యార్థుల చదువులు మరింత భారంగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ విద్యను పరిరక్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పాఠశాలలు, కళాశాలల్లో నిధులు పెంచకుండా జీఎస్టీ పేరుతో భారాలు మోపడంతో విద్యార్థులు చదువులు కొనసాగించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సేవారంగమైన విద్యపై జీఎస్టీ భారాలు పెంచి వ్యాపారం చేస్తున్నదని విమర్శించారు.