Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాన్యులను దోచి.. బడాబాబుల జేబులు నింపుతున్న బీజేపీ
- పేదలకు ఉచితాలు వద్దంటా.. కార్పొరేట్లకు రుణ మాఫీలు చేస్తారట: బీజేపీ నాయకులపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
నవతెలంగాణ-సంగారెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్తూ.. ప్రభుత్వ సంపదను గద్దల పాలు చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సామాన్యులను దోచి బడాబాబుల జేబులు నింపుతున్నారని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉచితాలు బంద్ జేయాలని, ఉచితాలు ఇచ్చే వాళ్లను నమ్మొద్దని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీ పాలిత ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలను అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఉచితాలు వద్దంటే.. ఆసరా పింఛన్లు, ఉచిత రేషన్ బియ్యం, రైతులకు ఇచ్చే పెట్టుబడి పథకాలు, కల్యాణ లక్ష్మి, గర్భిణీలకు ఇచ్చే కేసీఆర్ కిట్‌తో పాటు రూ.12 వేలు లాంటి పథకాలను రద్దు చేయమంటున్నారా అని ప్రశ్నించారు. కార్పొరేట్లకు, బడాబాబులకు కేంద్రం బీజేపీ ప్రభుత్వం వేల కోట్ల రుణాలు ఎలా మాఫీ చేస్తుందని విమర్శించారు.
తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నామని, పక్కనే ఉన్న బీదర్‌లో ఉచిత కరెంటు లేదని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేవలం బురదజల్లే రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఎనిమిదేండ్లుగా బీజేపీ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల కోసం ముహూర్తాలు చూసుకొని ఆపరేషన్ చేయాలని డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదన్నారు. నార్మల్ డెలివరీల కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. నార్మల్ డెలివరీలతో తల్లి, బిడ్డా క్షేమంగా ఉంటారని, బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తాగించడంతో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా బొత్తుగా ఎత్తుగా పెరుగుతారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఏ.శరత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజు శ్రీ, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లతా విజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.