Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గూడు చెదిరి.. గుండె పగిలి రోదిస్తున్న బాధితులు
- బురద తీసి ఇండ్లను శుభ్రం చేసేందుకు తంటాలు
- తినేందుకు తిండి.. తాగేందుకు నీళ్లు లేక అవస్థలు
- ఇండ్లు నేలమట్టమైన వారి దుస్థితి వర్ణనాతీతం
- భద్రాద్రి ఏజెన్సీలో కదిలిస్తే కన్నీరు..
కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి
భద్రాద్రి ఏజెన్సీ నుంచి గ్రౌండ్ రిపోర్టు
గోదారమ్మ ధాటికి ఎంతో మంది జీవితాలు కకావికలమైనాయి. వరద ముంపు ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఏ ఇంటిని చూసినా.. బురద మేటలు వేసి దుర్గంధం వెదజల్లుతోంది. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో ముంపు తొలగడంతో పునరావాస కేంద్రాల నుంచి సొంత ఇండ్లకు చేరుకున్న బాధితులు.. ఈగలు.. దోమలు.. క్రిమికీటకాలు.. విషసర్పాలకు నిలయమై ఉన్న ఆ ఒండ్రు మట్టిని తొలగించేందుకు వారు పడే బాధలు వర్ణనాతీతం. ఇక ఇండ్లు నేలమట్టమైన వారి దుస్థితి హృదయ విదారకంగా ఉంది. పునరావాస కేంద్రాలు వీడితే తమ బాధ్యత లేదని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తిండి కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల మంచి నీరు కూడా కరువై నానా ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ఎవరైనా చేరదీసి బుక్కెడన్నం పెడితే సరేసరి. లేదంటే ఆ రోజు పస్తులే. ఇక వృద్ధులు, పిల్లలు, గర్భిణుల పరిస్థితి మరింత దారుణం.
నాడు వరద.. నేడు బురదలో..
ఓవైపు ఇండ్లు, వాకిళ్లు బురద మేటలు వేసి కాలు మోపేందుకు వీలు లేకుండా ఉంటే.. పట్టెడన్నం కోసం పడుతున్న పాట్లు చెప్పనలివి కాకుండా ఉన్నాయి. చర్ల మండలం కొత్తపల్లి కాలనీతో పాటు దండుపేట, జీడిపల్లి, చింతకుంట, ఆనందకాలనీ, కల్లంగుంపు, విజయకాలనీతో పాటు కొన్ని గ్రామాలు, అశ్వాపురం మండలంలో 24 పంచాయతీలకు గాను ఆరు ముంపు బారిన పడగా ఒక్కో పంచాయతీలో 10 గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. పినపాక మండలంలో 28 పంచాయతీలకు గాను 20 పంచాయతీలదీ ఇదే పరిస్థితి. 52 పాఠశాలల్లో బురద మేటలు వేసింది. ఆ మేటల్లోనే విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, బల్లలు, కుర్చీలు, బోధనా సామగ్రి ఉండిపోయాయి. దుమ్ముగూడెం మండలం ఎల్ కాశీనగరం లాంటి కొన్ని గూడేల్లో ఇంట్లో పేరుకుపోయిన ఒండ్రును తొలగించలేక సీసీ రోడ్లపై డేరాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. అంతేకాదు, ఒక కుటుంబంతో ఒండ్రును తొలగించడం సాధ్యం కాని చోట నాలుగైదు కుటుంబాల వాళ్లు కలిసి ఆ పని నిర్వహిస్తున్నారు. వారం రోజుల తర్వాత కరెంట్ పునరుద్ధరించడంతో మోటార్లు ఉన్న వాళ్లు నీళ్లిస్తే ఆ నీటితో ఇంట్లో ఉన్న వస్తువులను శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. మంచాలు, కంచాలు, బీరువాలు, టీవీలు ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం బురదమయం కావడంతో ఒక్కో వస్తువును తీసుకొచ్చి సీసీ రోడ్ల మీద వేసి శుభ్రం చేసుకుంటున్నారు. వృద్ధులమైన తాము ఇండ్లను శుభ్రం చేసుకోవడం కష్టంగా మారిందని చర్ల మండలానికి చెందిన సమ్మక్క కన్నీటి పర్యంతమయ్యారు. దుమ్ముగూడెం మండలం నాలుగు, చర్ల మండలం ఎనిమిది గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోనూ అన్నపానీయాలకూ అష్టకష్టాలు పడ్డామని బాధితులు చెప్పారు. అందుకే ఇండ్లను శుభ్రం చేసుకుందామని వస్తే పెద్దమొత్తంలో మేటలు వేసిన ఒండ్రును తొలగించడం కష్టతరంగా మారిందని చెప్పుకొచ్చారు.
ఇండ్లు కూలితే ఇక్కట్లే...
ముంపు బారిన పడి అనేక ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఇంకా కొన్ని ఇండ్లు ముంపు నుంచి బయటపడలేదు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం తగ్గుతున్న నేపథ్యంలో క్రమేణా ఇండ్లు బయటపడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 12,777 ఇండ్లు ముంపునకు గురయ్యాయి. వీటిలో 11,061 గృహాలు ముంపు నుంచి బయటపడ్డాయి. ఇంకా దాదాపు 1200 గృహాల వరకూ ముంపులోనే ఉన్నాయి. చర్ల మండలానికి చెందిన బేబమ్మ, అమర్నాథ్ కుటుంబాలకు చెందిన ఇండ్లు నేలమట్టం కావడంతో దానిలోని వస్తువులన్నీ ఒండ్రులో కూరుకుపోయాయి. ఏ ఒక్కటీ తీసి వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
వీధులకే పరిమితమైన పారిశుద్ధ చర్యలు
రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు, డిప్యూటీ కమిషనర్ పి.రవీందర్, గ్రామీణ్ స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. 52 మంది మండల పంచాయతీ అధికారులు ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పారిశుద్ధ్య చర్యలు కేవలం వీధులకే పరిమితమయ్యాయి. కానీ ఇండ్లలో టన్నుల కొద్దీ ఒండ్రు మట్టి నిల్వలున్నాయి. వీటిని యంత్రాలు, పారిశుధ్య కార్మికుల సహకారంతో తొలగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.లక్ష పరిహారం ఇవ్వకపోతే మాకు చావేదిక్కు - బేబమ్మ, కొత్తపల్లి, చర్ల మండలం
ఇల్లు సాంతం కూలిపోయింది. ఏ ఒక్క వస్తువూ బయటకు తీసేటట్టు లేదు. బీరువా, టీవీ, బియ్యం, బట్టలు అన్నీ దానిలోనే ఉన్నాయి. వండుకునేందుకు వంట పాత్రలు లేవు. రూ.10వేల పరిహారం మాకు ఏమాత్రం సరిపోదు. రూ.లక్ష ఇచ్చినా ఇంకా తక్కువే. అది కూడా ఇవ్వకపోతే మాకు చావే దిక్కు. ఇంట్లో ఉన్న వస్తువులు బయటకు తీద్దామని ప్రయత్నిస్తే పాములు బయటకు వచ్చాయి. ఒకటి, రెండు తాచు పాములను కూడా చంపాం. ఇంకా ఏమైనా ఉండి ఉంటాయని, చుట్టు పక్కల వాళ్లు వద్దన్నారు. నేను, నాభర్త ఇద్దరు పిల్లలం కట్టుబట్టలతో మిగిలాం. పక్కింటి వాళ్లు బుక్కెడన్నం పెడితే తింటున్నాం. ఒకపూట తిని మరో పూట పస్తులుంటున్నాం. పునరావాస కేంద్రం నుంచి బయటకు వచ్చామని తిండి కూడా పెట్టట్లేదు.
ఇండ్లలోనూ బురద తొలగించాలి.. - మందడి అర్జున్‌రావు, సున్నంబట్టి గ్రామం, దుమ్ముగూడెం
ఊళ్లో చిరువ్యాపారం చేసుకుని బతుకుతున్నా. వరదలొచ్చిన సమయంలో మోటారు బోటు వేసుకుని గ్రామస్తులను రక్షించేందుకు వెళ్లా. ఒక్కసారిగా నా ఇంటిని కూడా వరద చుట్టు ముట్టడంతో నా షాపులో ఉన్న రూ.30వేలు, ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్న మట్టిని తొలగించాలంటేనే నాకు రూ.20వేల దాక ఖర్చు వస్తుంది. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వీధులతో పాటు ఇండ్లలోనూ బురద తొలగించాలి. ఇక వస్తువులు, తిండి, కూరగాయలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి రూ.లక్షకు పైగానే సహకారం అందాలి.
పకడ్బందీగా పారిశుధ్య చర్యలు: హనుమంతరావు, పంచాయతీరాజ్ డిప్యూటీ డైరెక్టర్
వరద ముంపు నుంచి బయటపడిన 71 పంచాయతీల్లో ముంపు నుంచి బయటపడిన రెండు రోజుల్లో 4,438 మంది గ్రామపంచాయతీ, మున్సిపల్, సింగరేణి సిబ్బంది సహకారంతో పారిశుధ్య చర్యలు పూర్తి చేశాం. గ్రామాల్లో మట్టి, బురద లేకుండా తొలగించాం.