Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఐఈఏ సమావేశంలో కె వేణుగోపాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్టాక్మార్కెట్లో ఊహాగానాల ఆధారంగా జరిగే లావాదేవీలను, తదనుగుణంగా ఎల్ఐసీ విలువ తగ్గినట్టు జరుగుతున్న ప్రచారం పట్ల ఉద్యోగులు, పాలసీదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కె.వేణుగోపాల్ చెప్పారు. ఏఐఐఈఏ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళశారం హైదరాబాద్ అరవింద్ నగర్లోని సుగుణాకర్రావు భవన్లో 'ఎల్ఐసీలో ఐపీఓ అనంతరం బీమారంగం ముందున్న సవాళ్ల' అనే అంశంపై ఆయన క్లెమెంట్ దాస్ స్మారకోప న్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ముందుకు తెచ్చిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఐపీఓలను గమనిస్తే... పాలకుల దురుద్దేశం అర్థమ వుతున్నదనీ, రాబోయే రోజుల్లో పాలసీదారులు, ప్రజలతో కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎల్ఐసీలో మున్ముందు పెట్టుబడుల ఉపసంహరణ పై ప్రచార, పోరాట కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. క్లెమెంట్ ఉద్యోగులు, కార్మికులకు సుదీర్ఘకాలంపాటు సేవలందించారని తెలిపారు. కేవలం ఎల్ఐసీలోని ఉద్యోగుల కోసమేగాక, వివిధ రంగాల్లోని ఇతర ఉద్యోగ, కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. కార్మికవర్గ ఐక్యత కోసం తన చివరి శ్వాస వరకు పాటుపడ్డారని చెప్పారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, ఏఐఐఈఏ అధ్యక్షులు వి.రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంతమిశ్రా, కోశాధికారి బి.ఎస్.రవి, సంయుక్త కార్యదర్శి కె.వి.వి.ఎస్.ఎన్.రాజు, సహాయ కోశాధికారి కే.ఎస్.రాజశేఖర్, జోనల్ ప్రధాన కార్యదర్శి టి.వి.ఎన్.ఎస్.రవీంద్రనాథ్, హైదరాబాద్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అధీష్రెడ్డి, తిరుపతయ్య, సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ఎన్.శ్రీనివాసులు, డి.ఎస్.రఘు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని ఎల్ఐసీ, జీఐసీ ఉద్యోగులతోపాటు, ఇతర కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.