Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి
- ఏడు మండలాలు వెనక్కి ఇవ్వాలనే తీర్మానాన్ని కేంద్రానికి పంపారా?
- వరద సహాయక చర్యలకు రూ. వెయ్యి కోట్లు సరిపోవు
- పంట నష్టం అంచనా వేసి నిధులు విడుదల చేయాలి
- క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు బాధ్యతారహిత్యం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచుతూ పోతుంటే మీరేం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ ఎత్తు మూడు మీటర్లు పెంచడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని తెలిసినా సీఎం ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలవరం ఎత్తును పెంచడం ద్వారా అమాయక గిరిజనులు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. 'కష్ణా, గోదావరి నదులపై ఆనకట్టల నిర్మాణాలను ప్రతి రోజు ముఖ్యమంత్రి గూగుల్ ద్వారా వీక్షిస్తారనే ప్రచారం ఉంది. అలాంటప్పుడు పెంచుతున్న పోలవరం నిర్మాణం ఆయనకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ సర్కారు నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందనీ, ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్పార్టీగా ఒత్తిడి పెంచి అసెంబ్లీలో తీర్మానం చేయించామన్నారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారా? లేదా? పంపిస్తే ప్రధాని మోడీ ఏం చెప్పారో ప్రజలకు వివరించాలని కోరారు. ఆర్డినెన్స్ రద్దు కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో మూడువేల ఎకరాలు ముంపునకు గురవుతుంటే ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోలేదనీ, ఈ క్రమంలో పోలవరం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల ఎకరాల ముంపుకు గురవుతుంటే సీఎం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తిరిగి ఏడు మండలాలను తీసుకురావడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తుందో వెల్లడించాలని కోరారు. ముంపు ప్రాంతాలకు వరదలు పైనుంచి వచ్చిందా? లేక పోలవరం నుండే వచ్చిందా? అనే విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా పోలవరం ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే నిపుణుల కమిటీ వేసి సమగ్ర విచారణ చేయించి నివేదిక తీసుకుని అందుకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. టీిఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి152 అడుగుల్లో నిర్మించాల్సిన దీన్ని 100 మీటర్ల దిగువకు కుదించి మేడిగడ్డ వద్ద నిర్మించడం వల్లే బ్యాక్ వాటర్‌తో అనేక జిల్లాల్లో వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.
ఇంజనీర్లు చేయాల్సిన ప్రాజెక్టు నిర్మాణం పనులను కేసీఆర్ చేయడం వల్లే ఇలా ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులపై టెక్నికల్ కమిటీలను వేయాలని డిమాండ్ చేశారు. సాంకేతిక నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముంపునకు గురి కాకుండా ఏం చేస్తే బాగుంటుందో సమగ్ర నివేదిక రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఇస్తానన్న రూ 1000 కోట్లు సరిపోవని చెప్పారు. పంటనష్టం అంచనా వేయించి అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలను పక్కదారి పట్టించడానికి ముఖ్యమంత్రి క్లౌడ్ బరస్ట్ అంటూ వ్యాఖ్యలు చేయడం బాధ్యతరాహిత్యమని విమర్శించారు.