Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుకను తొలగించేందుకు ఇబ్బందులు
- ఆర్థికంగా చితికిపోతున్న రైతులు
నవతెలంగాణ-కమ్మర్పల్లి
ఇటీవల కురిసిన వర్షాలకు వరద వెంట ఇసుక వచ్చి పంటలను కమ్మేసాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరాలో సుమారు 18 నుంచి 20 ట్రాక్టర్ల ఇసుక మేటలు వేయడంతో రైతులు పంటలను పూర్తిగా కోల్పోయారు. వాగులు, చెరువులు అలుగు పారడంతో లోతట్టు ప్రాంతాల్లో వరదతో పాటు వచ్చిన ఇసుక మేటలు వేసింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, బోధన్ తదితర మండలాల్లో పలు చోట్ల పంటలను ఇసుక మేటలు కమ్మేసాయి. ప్రధానంగా కమ్మర్పల్లి మండలంలో వందలాది ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఒక్క ఉప్లూర్ గ్రామంలోనే సుమారు 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటల్లో ఇసుక మేటలు వేసింది. మండలంలోని అన్ని ప్రాజెక్టులు, గ్రామాల్లో చెరువులు కుంటలు నిండి అలుగులు ఉధృతంగా ప్రవహించడంతో వరదప్రవాహానికి కొట్టుకొచ్చిన ఇసుక పంట పొలాల్లో మేటలు వేసింది. దాంతో సోయాబిన్, పసుపు, మొక్కజొన్న, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాలను కమ్మేసిన ఇసుక మేటలను తొగించేందుకు రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే వేసిన పంటలు చేతికి రాకుండా పోగా, పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను తీసేందుకు డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో ట్రాక్టర్లో ఇసుక తీసేందుకు రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతుందని, మళ్ళీ విత్తేందుకు విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయం ముందుకు వెళ్ళడంతో తరువాత వేసే పంటపై ప్రభావం పడుతుందని రైతులు తెలిపారు. ఉప్లూర్ గ్రామంలో ఒక్కో ఎకరాలో 15 నుంచి 20 ట్రాక్టర్ల వరకు ఇసుకు మేటలు వేసినట్టు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతుల కోరుతున్నారు.