Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బియ్యాన్ని ప్రభుత్వం తీసుకోవాలి
- మిల్లుల్లో ధాన్యాన్ని పరిశీలించిన జులకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వం వెంటనే బియ్యాన్ని సేకరించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కృష్ణాపురం వద్ద ఉన్న శివరామకృష్ణ రైస్‌మిల్లును జూలకంటి సందర్శించారు. మిల్లులో నిల్వ ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని పరిశీలించారు. గత యాసంగి, వానాకాలం, ఈ యాసంగి సీజన్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఐకేపీ ద్వారా కొనుగోలు చేసి మిల్లులకు తరలించారన్నారు. బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మిల్లింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. బలవంతంగా మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేశారని, వాటిని నిల్వ చేసేందుకు మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సీఎంఆర్ బియ్యం సేకరణ నిలిచిపోయి 43 రోజులు గడుస్తున్నాయని, దాని కారణంగా సీఎంఆర్ చేసే మిల్లులు సుమారు 1500 పైగా మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా సుమారు లక్షా 50 వేల మంది హమాలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం అకాల వర్షంతో తడిసిపోయి సుమారు 10 శాతం వరకు పాడైందని చెప్పారు. ఆ నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మిల్లులపైనే మోపుతుందని విమర్శించారు. ధాన్యం నిల్వ చేసుకున్నందుకు గోదాములు లేక ఆరుబయట నిల్వ చేసి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ధాన్యం తడిసి మొలకెత్తిందని, చాలాకాలం నిల్వ ఉండటం వల్ల ధాన్యం పాడవుతుందని చెప్పారు. గతంలో మిల్లింగ్ చేసిన చార్జీలు కూడా రూ.కోట్లలో పెండింగ్ ఉందన్నారు. మిల్లింగ్ చార్జీలు రాక మిల్లర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చి బియ్యం సేకరించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తన బియ్యం కోటాను వెంటనే సేకరించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన కోటాను తీసుకొని పేదలకు పంచాలని కోరారు. ఆపై ఉంటే బహిరంగ వేలం పెట్టి అమ్మాలని డిమాండ్ చేశారు. మిల్లుల్లో జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని, మూతపడిన మిల్లులను తెరిపించి రైస్‌మిల్లర్స్, హమాలీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట మిల్లు యజమాని వెంకటరత్నం, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేశ్, నాయకులు రవినాయక్, జగదీష్‌చంద్ర, అయ్యూబ్, కృష్ణ, శ్రీనివాస్, గోపి, లతీఫ్, లింగయ్య, పతాన్ని శ్రీను, వెంకన్న, విజరు, నాగేందర్ ఉన్నారు.