Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏల కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్ష
- పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్
- 23న కలెక్టరేట్ల ముట్టడి
- అయినా స్పందించకుంటే సమ్మెకు వెళ్తామని ప్రకటన
నవతెలంగాణ- విలేకరులు
తమను రెగ్యులరైజ్ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలని, పేస్కేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. కలెక్టరేట్ల ఎదుట దీక్షాశిబిరాలు పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష ప్రారంభించారు. వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మెన్ పైండ్ల చందు, కో చైర్మెన్ నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారం అర్జున్ మాట్లాడారు. ముఖ్యమంత్రి 2017లో ప్రగతి భవన్ సాక్షిగా, 2020లో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఈ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మెన్ వెంకటేశ్ముదిరాజ్ ఆధ్వర్యంలో రీలే నిరహార దీక్ష చేపట్టారు. వీఆర్ఏలు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. దీక్షలనుద్దేశించి వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చల్లా లింగరాజు, చైర్మెన్ షేక్ అజిజ్ ప్రసంగించారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాక కూడా.. ప్రభుత్వ స్పందన లేకపోతే 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే 25 తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పారు. ప్రభుత్వం వీఆర్ఏలతో చర్చించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.