Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్
- రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం
- పలు చోట్ల విద్యార్థి నాయకుల అరెస్ట్
నవతెలంగాణ-విలేకరులు
విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్క రించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టి న విద్యాసంస్థల బంద్ రాష్ట్రవ్యాప్తంగా విజయవంత మైంది. ప్రభుత్వ విద్యారం గాన్ని పటిష్టం చేయాలని, కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలను మూసివేయించి బంద్ నిర్వహించారు. పలు జిల్లాల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో మహిళా జూనియర్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరెట్ లోపలికి చొచ్చుకుపోయేందుకు విద్యార్థి నాయకులు ప్రయత్నంచగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థి నాయకులకు తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల బంద్ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో ప్రభుత్వ పాఠశాల, కళాశాలలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు, విద్యార్థి జన సమితి, బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో చేపట్టిన బంద్‌కి ప్రభుత్వ, ప్రయివేటు, జూనియర్, డిగ్రీ కళాశాలలు స్వచ్చందంగా సెలవు ప్రకటించాయి. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమై నెలరోజులు గడిచినప్పటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పుస్తకాలు లేకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియకుల శ్రీకాంత్‌వర్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, ఏఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలను మూసి వేయించారు. చేవెళ్లలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలలు మూసివేయించారు. ఆమనగల్ పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు. రాజేంద్రనగర్, చందానగర్‌లో పాఠశాలలు, కళాశాలలు మూసి చేయించి బంద్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం అయింది. ప్రయివేటు విద్యా సంస్థలు ముందస్తుగానే సెలవు ప్రకటించగా, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. సిద్దిపేట, మెదక్, గజ్వేల్, సంగారెడ్డి, జహీరాబాద్ తదితర అన్ని పట్టణాల్లో విద్యాసంఘాల నాయకులు ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలను మూసివేయించారు. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.