Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ భర్త దూషించడంతోనే..
- కుటుంబం సభ్యుల ఆవేదన
- గ్రామస్తుల ఆందోళన
నవతెలంగాణ - కొనరావుపేట
సమస్యలపై అధికారులు ప్రశ్నించారన్న కోపంతో సర్పంచ్ భర్త.. జీపీ కార్మికున్ని దుర్భాషలాడి విధుల నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురైన ఆ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన ఆకుల రామదాసు(65) 30ఏండ్లుగా గ్రామంలో జీపీ కార్మికుడి(పంప్ ఆపరేటర్)గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 17న కేంద్ర బృందం, అందనపు కలెక్టర్ పరిశీలనకు వచ్చారు. ఈ క్రమంలో గ్రామస్తులు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. కాలనీల్లో తాగునీరు రావడం లేదని, సమస్యలపై సర్పంచ్, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయంపై అధికారులు సర్పంచ్‌ను ప్రశ్నించారు. దాంతో ఆగ్రహం చెందిన సర్పంచ్ ఆరె లత భర్త మహేందర్ పంప్ ఆపరేటర్ రామదాసును దుర్భాషలాడాడు. విధుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పాడు. అయినా, గ్రామస్తులు కోరిక మేరకు రామదాసు నల్లాలను పెట్టడంతో సర్పంచ్ భర్త మరోసారి దూషిం చాడు. దీంతో మనస్తాపం చెందిన రామదాసు తన ఇంటి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు.
గ్రామస్తుల ఆగ్రహం..
రామదాసు మృతికి కారణమైన సర్పంచ్ భర్తను కఠినంగా శిక్షించి, సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు బాధిత కుటుంబీకులతో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. చందుర్తి సీఐ శ్రీలత, వేములవాడ సీఐ వెంకటేష్, కోనరావుపేట చందుర్తి, రుద్రంగి మండలాల ఎస్ఐలు రమాకాంత్, రమేష్, విజరు కుమార్ గ్రామస్తులతో మాట్లాడినా ఆందోళన విరమించలేదు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, సర్పంచ్ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ చంద్రయ్య గౌడ్, జెడ్పీ సీఈవో లీలావతి, డీఎల్పీవో మల్లికార్జున్, ఎంపీడీవో రామకృష్ణ అక్కడికొచ్చి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా వినలేదు. కలెక్టర్ వచ్చే వరకు మృతదేహాన్ని తీసేది లేదని, లేదంటే గ్రామపంచాయతీలో మృతదేహాన్ని పెట్టి ఆందోళన చేపడతామని గ్రామస్తులు భీష్మించారు.