Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు భూముల్లో రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం
- తుపాకులు ఎక్కిపెట్టి బెదిరింపు
- రైతులపైనే కేసు పెట్టి జైలుకు పంపిన పోలీసులు
- బాధిత కుటుంబాల పోరాటం.. మంత్రికి మొర
- చివరకు బౌన్సర్లపై కేసు నమోదు
- 9 మందిలో ముగ్గురి రిమాండ్
నవతెలంగాణ -చౌటుప్పల్‌రూరల్
రైతుల సాగు భూముల్లో అక్రమంగా జొరబడి వెంచర్ చేసేందుకు యత్నించడమే కాకుండా.. వ్యవసాయ పనులు చేసుకుంటున్న అన్నదాతలపై రియల్ ఎస్టేట్ సంస్థ బౌన్సర్లు దాడి చేశారు.. మారణాయుధాలు, తుపాకులు ఎక్కుపెట్టి చంపేస్తామంటూ బెదిరించారు.. దీనిపై రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.. రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు ఆధారంగా రైతులపై అక్రమ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.. దీనిపై పెద్దఎత్తున ఆందోళన.. మంత్రి ఆదేశంతో చివరకు బుధవారం బౌన్సర్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి, దేవలమ్మ నాగారం, కొయ్యలగూడెం గ్రామాల్లో ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లు చేస్తోంది. అందులో తమ భూములున్నాయంటూ స్థానిక రైతులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. తంగడపల్లి గ్రామానికి చెందిన మిద్దెల సుగుణమ్మకు సర్వేనెంబర్ 687లో రెండెకరాల భూమి ఉంది. ఈనెల 14న ఆమె కుటుంబ సభ్యులైన మిద్దెల రంగయ్య, కృష్ణ, బద్రి, పరమేష్ తమ భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ చేస్తున్న వెంచర్లో ఈ భూమి ఉండటంతో రైతులపై బౌన్సర్లు తుపాకులను చూపిస్తూ, కర్రలతో దాడి చేశారు. కొట్టి చంపుతామని బెదిరించారు. దీనిపై రైతులు, రియల్ ఎస్టేట్ సంస్థ ఒకరిపై మరొకరు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. చౌటుప్పల్ పోలీసులు రైతులపై వెంటనే కేసు నమోదు చేసి, అర్ధరాత్రి నలుగురిని రిమాండ్ చేసి జైలుకు పంపించారు. రైతుల ఫిర్యాదును మాత్రం పట్టించుకోలేదు. దీంతో రైతుల కుటుంబాలు చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాయి. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. అక్రమంగా తమ భూముల్లోకి రావడమే కాకుండా.. దాడి చేసి.. తమపైనే కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెద్దఎత్తున మద్దతు లభించడంతో దాడి చేసిన బౌన్సర్లపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎపిటోమ్ సంస్థ సభ్యులు ఒకరు,
బౌన్సర్లు 8 మంది
రైతులపై దాడి చేసిన ఎపిటోమ్ సంస్థ నిర్వాహకుల్లో ఒకరిపైనా, 8 మంది బౌన్సర్లపైనా ఐపీసీ సెక్షన్ 143,148,324,447, 506ఆర్/డబ్ల్యూ,25(1),(బి). ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్టు చౌటుప్పల్ సీఐ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. ఎపిటోమ్ సంస్థ సభ్యులు ఆకుల నిశాంత్, సెక్యూరిటీగా ఉన్న బౌన్సర్లు భువనగిరి అర్భన్ కాలనికి చెందిన బోగ వెంకటేష్, చౌటుప్పల్‌లోని హనుమాన్ నగర్‌కు చెందిన పప్పు కుమార్ శర్మ, చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామానికి చెందిన బి.జి.మహేందర్, తంగడపల్లి గ్రామానికి చెందిన రఘు, హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన గంట్ల రమేష్, గడ్డి అన్నారానికి చెందిన జోగుల రామన్, తంగడపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, ఎర్రగడ్డకు చెందిన గజ్జల కృష్ణపై కేసు నమోదు చేశారు. వీరిలో బోగా వెంకటేష్, పప్పు కుమార్ శర్మ, బి.జి మహేందర్‌ను రిమాండ్ చేసి నల్లగొండ జైలుకు తరలించారు. మిగతా వారు పరారీలో ఉన్నారు.