Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అధిక వర్షాల వల్ల పంటనష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలనీ, తిరిగి పంట వేసేందుకు విత్తనాలు, ఎరువులు, రుణాలివ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు లక్షల ఎకరాల్లో పత్తిపంట నష్టం జరిగిందనీ, ఎకరాకు రూ.8,000ల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయన్నారు. తిరిగి పంటలు వేయడానికి బ్యాంకులు రుణ సహాయం చేయాలని కోరారు. రైతుబంధు సొమ్ము, ధాన్యం డబ్బులను రైతులకు ఇవ్వకుండా బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నాయని విమర్శించారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రైతుల నుంచి అప్పులు వసూలు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ బ్యాంకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ధరణిలోని 11 లోపాలను సరి చేస్తామని చెప్పి మీసేవా కేంద్రాల ద్వారా ప్రతి రైతు నుంచి రూ.1650లు ఫీజు కట్టించుకుని ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా లోపాలన్నింటిని ప్రభుత్వం సరిచేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, జంగారెడ్డి, డాక్టర్ అరిబండి ప్రసాద్‌రావు, బండ శ్రీశైలం, మంగ నర్సింహ్మా, మాదినేని రమేష్, సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, శెట్టి వెంకన్న, బాల్‌రెడ్డి, మిల్కూరి వాసుదేవరెడ్డి, జయరాజు, వర్ణ వెంకట్‌రెడ్డి, యం. శ్రీనివాసులు, యం.డి గఫూర్, కూన్‌సోత్ ధర్మా తదితరులు పాల్గొన్నారు.