Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'డిక్కీ' సభలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రపంచ పాలకులందరికీ నిరుద్యోగ నిర్మూలనే అతిపెద్ద సవాలు అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. అమెరికా ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అయినా, భారతదేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ అయినా, రాష్ట్రాన్ని నడుపుతున్న సీఎం కేసీఆర్ అయినా... అందరి ముందున్న అతి పెద్ద సవాలు ఉపాధి కల్పన, నిరుద్యోగ నిర్మూలనే అని చెప్పారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (డిక్కీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడల్ కేరీర్ సెంటర్‌ను బుధవారం నాడాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. ఏటా లక్షల మంది విద్యార్థులు చదువుకొని విద్యావంతులు అవుతున్నా రనీ, వారి అర్హతలకు తగినట్టు ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పన పరిమితంగానే ఉంటుందనీ, మిగిలినవారు స్వయం ఉపాధి అవకాశాల వైపు వెళ్లి, పారిశ్రామికవేత్తలుగా మారాలని చెప్పారు. వారి ద్వారా మరికొందరికి ఉపాధి అవకాశాలు లభిస్తాయ ని విశ్లేషించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నదని వివరించారు. దళితబంధు పథకాన్ని పుట్నాలు, బఠాణీల మాదిరిగా పంచేందుకు పెట్టలేదన్నారు. సంపద పునరుత్పత్తి కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమనీ, సమాజ మార్పును కాంక్షిస్తున్నామనీ తెలిపారు. పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నామని గుర్తుచేశారు. సమాజం భిన్నత్వంలో ఏకత్వం సాధించాలనీ, అప్పుడే అందరికీ అవకాశాలు లభిస్తాయన్నారు. దేవుడు మనిషిని పుట్టిస్తే, మనిషి కులమతాలను సృష్టించి, సమాజ విభజన చేసి బతుకుతున్నాడని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నది డబ్బున్న కులం, అది లేని కులం మాత్రమేనని విశ్లేషించారు. దళితుల్లో కూడా డబ్బున్న వారి స్థితిగతులు, అది లేని వారి జీవనం భిన్నంగా ఉంటాయని చెప్పారు. ప్రజలు సంపద సృష్టికర్తలుగా మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలువుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. డిక్కీ జాతీయ అధ్యక్షులు నర్రా రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, డిక్కీ వ్యవస్థాపక చైర్మెన్ మిలింద్ కాంబ్లీ, టీఎస్ఐఐసీ చైర్మెన్ బాలమల్లు, మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.