Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్ స్పెషాలిటీ తరహాలో మెరుగైన వైద్యసేవలు: టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
- తార్నాక ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-ఓయూ
ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లోని టీఎస్ ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ తరహాలో యుద్ధప్రాతిపదికన ఆధునీకరిస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. బుధవారం తార్నాకలోని టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వైద్య విభాగాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ సిబ్బందికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషంట్, అవుట్ పేషంట్వార్డులను పరిశీలించారు. ముఖ్యంగా ఇటీవల నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఐసీయూ, డయాలసిస్ యూనిట్లలో అందుతున్న సేవలను గమనించి అక్కడ చికిత్స పొందుతున్న ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం ఎండీ సమీక్షా సమావేశం నిర్వహించి వైద్యాధికారులతో వైద్య సేవలపై కూలంకషంగా చర్చించారు. సంస్థలోని 46 వేలకు పైగా ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 2 లక్షల మంది దాకా తార్నాక ఆస్పత్రిలో సేవలు పొందుతున్నట్టు అక్కడి వైద్యులు ఎండీకి చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ కూడా బాగుంటుందని, అందుకోసం వారి వైద్య సేవలకై ఆస్పత్రి ఆధునీకర ణలో భాగంగా త్వరలో 4 ఆపరేషన్ థియే టర్లు అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రత్యేక చర్చలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సంస్థ సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేకంగా వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యల విషయంలో అవసరమైన మేర వైద్య సేవల్ని అందించాలని డాక్టర్లకు సూచించారు. మందుల కొరత లేకుండా సరిపడా మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
సమావేశంలో తార్నాక ఆస్పత్రి ఓఎన్డీ వి.ఎస్.రెడ్డి, సూపరింటెం డెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ శైలజామూర్తి, సీని యర్ వైద్యాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.