Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి
- కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
- కనీస వేతనం అమలు చేయాలి :
రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాలో
- తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం (సీఐటీయూ)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోయినా వారు పస్తులుంటూ విద్యార్థులకు బువ్వ వండి పెడుతున్న కార్మికుల కడుపుగొట్టొద్దని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ అన్నారు. ఈ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష ధోరణి వీడనాడాలని, అక్షయపాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించి తమ కుడుపు కొట్టాలని చూస్తే.. పాలకుల కుర్చీ కూల్చుతామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెండింగ్ బిల్లులపై స్పందించని డీఈవో తక్షణమే బయటికి రావాలని.. ఆయన వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేదని కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట కార్మికులు భీష్మించారు. దాంతో డిప్యూటీ డీఈవో వచ్చి కార్మికులతో మాట్లాడారు.. తమ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ డీఈవోకి అందచేశారు. ఈ సందర్భంగా ఎస్.రమ మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా ఎలాంటి లాభాలు ఆశించకుండా ప్రభుత్వం సకాలంలో బిల్లు చెలించినా.. చెల్లించకపోయినా అప్పులు చేసి మరీ విద్యార్థుల కడుపు నింపుతు న్నారని తెలిపారు. అలాంటి వారి పొట్టగొట్టేందుకు కుట్రలు చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చేందుకు విద్యార్థులకు గుడ్లు, మాంసం పెట్టొద్దని నిర్ణయం తీసుకుందని తెలిపారు. పౌష్టికాహార లోపంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని సర్వేలు చెబుతుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం పిల్లలకు కొవ్వు పెరుగుతుందని సాకులు చెబుతూ గుడ్లు, మాంసం పెట్టొద్దనడం విడ్డూరంగా ఉందన్నారు. మత ఛాందస సంస్థలైన అక్షయ పాత్రలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించేందుకు కేంద్రం ఇలాంటి కుట్రలకు పన్నాగాలు పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అన్యాయం చేస్తే ఎంతాటి ఉద్యమానికైనా సిద్ధం అవుతామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి పంథాలు పక్కనపెట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కన్వీనర్ కవిత మాట్లాడుతూ.. తిండి పదార్థాలపై జీఎస్టీ పెంచిన ప్రభుత్వాలకు విద్యార్థుల మధ్యాహ్న భోజనం మెనూ పెంచే సోయి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జగదీశ్, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్, జిల్లా కార్యదిర్శ స్పప్న, సీఐటీయూ నాయకులు సాయిబాబు, కురుమయ్య, బ్రహ్మయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.