Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 ఏండ్లలో 5,903 మంది బలి
- 13,200కు పైగా పశువులు మృతి
- రికార్డులకెక్కని మరణాలు ఇంకా ఎక్కువే...
- పంపిణీ వ్యవస్థ బలోపేతానికి డిస్కంలు చేసిన ఖర్చు రూ.34,087 కోట్లు
- అయినా తగ్గని మరణాలు
- భద్రతకు తూట్లు-జవాబుదారీ లేదు...
- అస్తవ్యస్థంగా డిస్కంల నిర్వహణ
కరెంటు షాక్ కొడుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ షాక్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజల్లో అవగాహన కల్పించాల్సింది ఎవరు? కచ్చితంగా విద్యుత్ పంపిణీ సంస్థలే! రాష్ట్రంలోని దక్షిణ (హైదరాబాద్), ఉత్తర (వరంగల్) విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) రెండూ ఈ బాధ్యతల్ని గాలికొదిలేశాయి. అభివృద్ధి, విస్తరణ, 24/7 కరెంటు సరఫరా అని ఊదరగొడుతున్న ఈ సంస్థలు గడచిన 8 ఏండ్లలో (2014-15 నుంచి 2020-21 వరకు) సరఫరా, పంపిణీ నెట్వర్క్ బలోపేతం కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ.34,087 కోట్లు. ఇంత ఖర్చు చేసినా మనుషులు, మూగజీవాలు ఎందుకు ప్రాణాలొదులుతున్నాయనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానాలు లేవు. ఈ అంశాలపై వారిని ఎప్పుడు ప్రశ్నించినా 'చర్యలు తీసుకుంటున్నాం' అనే రోటీన్ డైలాగ్ కామన్‌గా వినిపిస్తూ ఉంటుంది
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల నిర్లక్ష్యం ఫలితంగా 2014-15 నుంచి 2020-21 (ఆ ఏడాది సెప్టెంబర్ దాకా) వరకు కరెంటు షాక్‌కు గురై మరణించిన మనుషుల సంఖ్య అక్షరాలా 5,903. ఇదే కాలానికి కరెంటుకు బలైపోయిన పశువులు 13వేలకు పైగానే. ఇంతమంది అమాయకులు, మూగజీవాల ప్రాణాలు తీసే అధికారం విద్యుత్ పంపిణీ సంస్థలకు ఎక్కడిదనే ప్రశ్నకు ప్రభుత్వం కూడా స్పష్టమైన సమాధానం చెప్పట్లేదు. మరణించిన మనిషి, పశువుకు వేర్వేరుగా నష్టపరిహారం రేటు కట్టి, అక్కడికి చేతులు దులిపేసుకుంటున్నాయి. మళ్ళీ కొత్త మరణాలు, పరిహారాలు, కోర్టులు, కేసులు షరామామూలే.
పశువుల లెక్క ఇదీ...
దక్షిణ డిస్కం పరిధిలో కరెంట్ షాక్‌కు గురై మరణించిన పశువుల సంఖ్య 3,272. వీటిలో 2,473 పశువులకు రూ.8 కోట్ల 81 లక్షల 66వేలు నష్టపరిహారం చెల్లించారు. 799 పశువులకు పరిహారం తిరస్కరించారు.
ఉత్తర డిస్కం పరిధిలో 8 ఏండ్లలో దాదాపు 10వేలకు పైగా పశువులు కరెంటు షాక్‌కు గురై మరణించాయి.
దాదాపు రూ.12 కోట్లకు పైగా ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. నాలుగు వేలకు పైగా పశుమరణాలను డిస్కం పరిగణనలోకి తీసుకోలేదు. వాటికి ఎలాంటి పరిహారం చెల్లించలేదు.
ఇవి కాకుండా వన్యప్రాణులు పెద్ద సంఖ్యలో కరెంట్ షాక్‌కు గురై మరణిస్తున్నాయి. వీటిలో జాతీయ పక్షులు నెమళ్లు అధికసంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. అయితే ఇవేవీ విద్యుత్ పంపిణీ సంస్థల రికార్డుల్లో నమోదు చేసి లేకపోవడం గమనార్హం. ఏటా సగటున విద్యుద్ఘాతానికి గురై దాదాపు 1,600కు పైగా పశువులు మృతిచెందుతున్నాయి.
దుర్భరంగా క్షతగాత్రుల బతుకులు...
మనుషులు మరణిస్తే విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తాయి. గొర్రె, బర్రె, మేక, ఎద్దు, ఆవు, గాడిద వంటి మూగజీవాలు మరణిస్తే ఒక్కో పశువుకు ఒక్కో రకమైన నష్టపరిహారం చెల్లిస్తారు. కరెంటు షాక్‌కు గురై ఏటా సగటున దాదాపు 737 మంది మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. దక్షిణ డిస్కం పరిధిలో క్షతగ్రాతులు (2014-15 నుంచి 2020-21 వరకు) 272 మంది. ఉత్తర డిస్కం పరిధిలో దాదాపు 680 మంది ఉన్నారు. వీరంతా శాశ్వతంగా, పాక్షికంగా అంగవైకల్యం పొందినవారు. వీరి బతుకులు దుర్భరంగా ఉన్నాయి. కుటుంబాలకు భారంగా మిగులుతున్నారు. విద్యుత్ సంస్థలు వీరిపట్ల కనీస కనికరం చూపట్లేదు. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి కొట్లాడిన కేసుల్లో మాత్రమే కాస్తో కూస్తో నష్టపరిహారం లభిస్తున్నది. ఆ వచ్చిన పరిహారం కూడా అప్పటి వరకు తిరిగిన ఖర్చులకే సరిపోతున్నాయని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అంతా సామాన్యులే
కరెంటు షాక్‌కు గురై మరణిస్తున్నవారంతా సామాన్య ప్రజలే. మృతుల్లో అదే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న లైన్మెన్లు, ఆర్టిజన్లు కూడా ఉన్నారు. విద్యుత్ స్తంబాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణా లోపాల వల్లే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాలు ప్రభుత్వానికీ, విద్యుత్ పంపిణీ సంస్థలకూ తెలుసు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అప్పటికప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత షరామామూలుగా వదిలేయడం పరిపాటిగా మారింది.