Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అత్యుత్సాహం
- విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్
- సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమం : నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం తలపెట్టిన బడులు, జూనియర్ కాలేజీల బంద్ సందర్భంగా విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలపనివ్వకుండా, నినాదాలివ్వనీయకుండా దొరికిన వారిని దొరికినట్టుగానే ఈడ్బుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. కనీసం మీడియా ప్రతినిధులతోనూ మాట్లాడనివ్వకుండా వారిని అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసు అధికారులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అందర్నీ అరెస్టు చేసి హైదరాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యారంగ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాలు బడులు, జూనియర్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వద్ద విద్యామంత్రి కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, ఎన్ అశోక్‌స్టాలిన్, ఎస్ నాగేశ్వరరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల రాష్ట్ర కార్యదర్శులు టి నాగరాజు (ఎస్ఎఫ్ఐ), ఆర్ శివరామకృష్ణ (ఏఐఎస్ఎఫ్), ఎం పరుశురాం (పీడీఎస్‌యూ), ఆర్ గంగాధర్ (ఏఐడీఎస్వో), గడ్డం శ్యామ్ (పీడీఎస్‌యూ), వంశీధర్‌రెడ్డి (ఏఐఎస్బీ), గడ్డం నాగార్జున (ఏఐఎఫ్డీఎస్) మాట్లడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించలేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల్లో పాఠ్యపుస్తకాలు లేవనీ, ఇంగ్లీషు, ఉర్దూ మాధ్యమంలో పూర్తిస్థాయిలో పుస్తకాలు రాలేదని చెప్పారు. పుస్తకాలు లేకుండా పాఠాలు ఎలా బోధిస్తారనీ, విద్యార్థులు ఎలా చదవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూనిఫారాల్లేకుండా పంద్రాగస్టుకు పాత బట్టలతో జెండా వందనం చేయాల్సిన దుస్థితి బంగారు తెలంగాణలో వచ్చిందన్నారు. పాఠశాలల్లో కనీసం పాఠాలు భోధించేందుకు సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని విమర్శించారు. ఉపాధ్యాయుల ఖాళీలుంటే చదువులు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు. స్వఛ్ఛ కార్మికులను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో నాణ్యమైన భోజనం అందించడం లేదన్నారు. నిరంతరం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నా కనీసం విద్యాశాఖ మంత్రి, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. విద్యారంగంపై కనీసం సమీక్షించకుండానే విద్యాసంవత్సరాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు.రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.377.28 కోట్లు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యావిధానం-2020 రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రవి, అశోక్‌రెడ్డి, లెనిన్, అనూష, రమేష్, నాగేందర్, సునీల్ (ఎస్ఎఫ్ఐ), రియాజ్, నాగరాజు (పీడీఎస్‌యూ), శ్రీమాన్ (ఏఐఎస్ఎఫ్.), సృజన్, నితీష్, ప్రతిభ, నాగరాజు, జాని (ఏఐడీఎస్వో), ఎస్ అనిల్, ప్రవీణ్, అశ్విని, నందిని, జ్యోతి (పీడీఎస్‌యూ), రోహిత్‌రెడ్డి, బాలకిషన్, శ్రీనివాస్, కనకయ్య (ఏఐఎస్బీ), భానుప్రకాశ్, ప్రసాద్, నాగరాజు, కిరణ్, అర్జున్ (ఏఐఎఫ్డీఎస్) తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుపై పోలీసుల దురుసు ప్రవర్తన
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు సందర్భంగా 10 టీవీ రిపోర్టర్ రాధికపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లైవ్‌లో మాట్లాడుతుండగానే ఆమెను అక్కడి నుంచి ఈడ్చి పక్కకు తోసేశారు. 'నా చేతిలో మీడియా లోగో కనిపిస్తున్నా ఎందుకు తోసేస్తున్నారు. మీ విధులకు ఆటంకం కలిగిస్తే పక్కకు జరగాలని చెప్పాలి. అంతేకానీ నా మీద చెయ్యి వేసి తోసేసే అధికారం ఎవరిచ్చారంటూ' ఆమె పోలీసులను నిలదీశారు. ఇది గమనించిన అక్కడి ఏసీపీ, సీఐలు పొరపాటున జరిగిందనీ, క్షమాపణ చెప్తున్నామని అనడంతో పరిస్థితి సద్దుమణిగింది. 10 టీవీ రిపోర్టర్ రాధికపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఆ కానిస్టేబుల్ ప్రవర్తనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.