Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత పుస్తకాలే వాడతాం ొ ఎస్సీఈఆర్టీ సిలబస్‌ను పట్టించుకోం
- ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను కొనేది లేదు ొ 30 శాతమూ అమ్ముడుపోని వైనం
- ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం ొ యధేచ్చగా ఆదేశాలు బేఖాతర్
- చేష్టలుడిగి చూస్తున్న సర్కార్ ొ సేల్ బుక్ ప్రింటర్ల అయోమయం
రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను యధేచ్చగా బేఖాతర్ చేస్తున్నాయి. రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన సిలబస్‌ను అవి పట్టించుకోవడం లేదు. సొంతంగా సిలబస్‌ను తయారు చేసుకుని ముద్రించిన పుస్తకాలనే ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇస్తుండటం గమనార్హం.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముద్రించిన పుస్తకాలను మాత్రం కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నాయి. జీవో నెంబర్ ఒకటి ప్రకారం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను వినియో గించకపోతే ఆ ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేసే అధికారాలు పాఠశాల విద్యాశాఖకు ఉన్నది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగి చూస్తున్నదన్న విమర్శలొస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ అధికారులు, డీఈవోలు సైతం వాటిలో తనిఖీలు చేపట్టి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే వినియోగించాలనే అంశంపై చర్యలు తీసుకోవడం లేదు. పర్యవేక్షణ శూన్యంగా ఉన్నది. నియంత్రణను గాలికొదిలేశారన్న విమర్శలు న్నాయి. ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు లొంగిపోయి అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సేల్ బుక్ ప్రింటర్ల యాజమాన్యాలు అయోమయంలో పడ్డాయి. పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసేలా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై ఒత్తిడి తేవాలనీ, నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అవి కోరుతున్నాయి.
ప్రయివేటు ప్రింటర్ల వెలవెల
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 1.22 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 13 ప్రయివేటు ప్రింటర్లు, పబ్లిషర్లు తరగతుల వారీగా ఆ పుస్తకాలను ముద్రించాయి. అయితే డీఈవోలు ఎంపిక చేసిన దుకాణాల్లోనే ఆయా పాఠ్యపుస్తకాలు ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థులు కొనాలి. అదీ యూడైస్ గణాంకాల ప్రకారమే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలను ముద్రిస్తారు. కానీ వాస్తవంగా అది కార్యరూపం దాల్చడం లేదు. 1.22 కోట్ల పాఠ్యపుస్తకాల్లో ఇప్పటి వరకు కనీసం 30 శాతం కొనుగోలు కాలేదంటే అతిశయోక్తి కాదు. అంటే 36.60 (30 శాతం) లక్షల పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఇంకా 85.40 (70 శాతం) లక్షల పాఠ్యపుస్తకాలను ప్రింటర్లు, పబ్లిషర్లు ముద్రించినా అమ్ముడుపోకుండా ఉన్నాయి. పదో తరగతి పాఠ్యపుస్తకాలు 2.50 లక్షల సెట్లను ముద్రించేందుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 54,200 (22 శాతం) సెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే 19.75 లక్షల పాఠ్యపుస్తకాలు ముద్రించారు. ఇప్పటి వరకు అమ్ముడుపోయినవి 4.90 (25 శాతం) లక్షల పుస్తకాలు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇంకా 14.85 లక్షల పుస్తకాలను ముద్రించినా అమ్ముడుపోలేదు. తొమ్మిదో తరగతికి సంబంధించి 2,55,914 పుస్తకాల సెట్‌ను ముద్రించేందుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి వరకు 61,300 (24 శాతం) సెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇలా అన్ని తరగతులకు చెందిన పుస్తకాలూ అవి అమ్ముడుపోవడం లేదు. దీంతో ప్రయివేటు ప్రింటర్లు, పబ్లిషర్ల గోదాములు వెలవెలబోతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వానికి పుస్తకాల ముద్రణ కోసం రూ.6.70 కోట్ల రాయల్టీని అవి చెల్లించాయి. కనీసం ఆ రాయల్టీ సైతం రాక దీనావస్థలో ఉన్నాయి.
పుస్తకాల పేరుతో దోపిడీ
ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన ప్రయివేటు ప్రింటర్లు, పబిషర్ల వద్ద పాఠ్యపుస్తకాలు ఎంఆర్పీకే దొరుకుతాయి. అంటే పదో తరగతి పాఠ్యపుస్తకాల సెట్ రూ.1060 అమ్మాలి. కానీ ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో అదే సెట్ కొన్ని సొంత పుస్తకాలు, వర్క్షీట్లు కలిపి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయిస్తుండడం గమనార్హం. అంటే పుస్తకాల పేరుతో అవి దోపిడీ చేస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులనే కాకుండా ప్రభుత్వాన్నీ దోపిడీ చేస్తున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల ఆగడాలు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను కొనడం లేదంటూ విద్యామంత్రి, విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు ప్రయివేటు ప్రింటర్లు, పబ్లిషర్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదు.
ముద్రణ వరకే మా పని : శ్రీనివాసాచారి,
ప్రభుత్వ ముద్రణాలయ సంస్థ డైరెక్టర్
పాఠ్యపుస్తకాల ముద్రణ ఆర్డర్ ఇవ్వడం వరకే మా పని. పుస్తకాలు అందరికీ అందుబాటులోకి తేవడం మా బాధ్యత. డీఈవోలు ఎంపిక చేసిన దుకాణాల్లో ఎంఆర్పీకే అమ్మాలి. దీన్ని మేం పర్యవేక్షిస్తాం. కానీ ప్రయివేటు పాఠశాలలు కొనేలా చూడాల్సిన బాధ్యత పాఠశాల విద్యాశాఖపై ఉంటుంది. వాటిపై అధికారం విద్యాశాఖ అధికారులదే.
ప్రయివేటు బడుల్లో తనిఖీలు చేపట్టాలి :
బాల్‌రెడ్డి, సేల్ బుక్ ప్రింటర్స్ ప్రతినిధి
రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యాశాఖ అధికారులు, డీఈవోలు తనిఖీలు చేపట్టాలి. ప్రభుత్వ పుస్తకాలు కొనేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పుస్తకాలు కొనని యాజమాన్యాలుంటే వాటిని చట్ట ప్రకారం శిక్షించాలి. జీవో నెంబర్ ఒకటిని అమలు చేయాలి. రాష్ట్రంలో ప్రయివేటు ప్రింటర్లు, పబ్లిషర్లను ప్రభుత్వం కాపాడాలి.
పాఠ్యపుస్తకాల వివరాలు
మొత్తం ముద్రించిన పుస్తకాలు - 1.22 కోట్లు
ఇప్పటి వరకు అమ్ముడుపోయినవి - 36.60 లక్షలు ఇంకా మిగిలిపోయినవి - 85.40 లక్షలు