Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల వెంటే రాష్ట్ర ప్రజానీకం
- భారతమాతను అమ్మకానికి పెట్టిన మోడీ: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
- సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోలీసుస్టేషన్లో కొనసాగుతున్న దీక్ష
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
సింగరేణి కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులకు సొంతింటి నిర్మాణంతోపాటు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షను ప్రారంభించిన అనంతరం జూలకంటి ప్రసంగించారు.సింగరేణి, ఆర్టీసీ కార్మికుల పోరాటాలతోనే ముఖ్యమంత్రి పదవి కేసిఆర్‌కు దక్కిందని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ.22 వేల కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో ఒక్క కొత్త బొగ్గు బావినీ ప్రారంభించలేదని, కార్మికుల సంఖ్య 64వేల నుంచి 42వేలకు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఉద్యోగులను నియమించకుండా కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలవడం కోసం రకరకాల హామీలను ఇచ్చి, గెలిచిన అనంతరం మర్చిపోవడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలుతోపాటు మిగతా డిమాండ్లను సాధించే వరకు జరిగే పోరాటానికి సీపీఐ(ఎం)తో పాటు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.ప్రజల శ్రమ, ప్రాణత్యాగంతో సృష్టించిన రూ.లక్షల కోట్ల సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్న మోడీది దుర్మార్గపు పాలనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలకు కష్టాలు, పెట్టుబడిదారులకు లాభాలను కట్టబెడుతున్న మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలపై రూ.138 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపి, పాల ఉత్పత్తులపై పన్నులు వేసి ప్రజలకు గుదిబండగా మారిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్నారు. మెండే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాగరాజ గోపాల్, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, సీనియర్ నాయకుడు వై.యాకయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షకార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఎ.ముత్యంరావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్ష : తుమ్మల రాజారెడ్డి
సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తానని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి కార్మిక, శాసనసభ ఎన్నికల్లో కార్మికుల ఓట్లను పొందడానికి ఇచ్చిన హామీలను గడిచిన నాలుగేండ్లుగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల చారిత్రాత్మకమైన పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రాణాలను తెగించి సింగరేణి కార్మికులు సృష్టిస్తున్న సంపదను ముఖ్యమంత్రి దుబారా చేస్తున్నారని విమర్శించారు. కార్మికుడు 30 ఏండ్లు సర్వీస్ పూర్తి చేసి, ఉద్యోగ విరమణ చేసిన అనంతరం కనీసం ఇంటి స్థలాన్ని కొనుక్కునే స్థితిలో కూడా లేరని ఆందోళన వ్యక్తం చేశారు.కార్మికులకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రుణం ఇవ్వాలని, అలవెన్స్‌లపై ఆదాయం పన్ను సింగరేణి సంస్థ చెల్లించే విధంగా ఆదేశించాలని డిమాండ్ చేశారు. హాజరులు పూర్తిచేసిన బదిలీ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, బినామీ పేర్లను సవరించాలని, కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బలవంతంగా దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
దీక్షకు పలువురి మద్దతు
రాజారెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల, ప్రజా సంఘాల నాయకులు తరలివచ్చారు. కాంగ్రెస్, ఎఐటీయుసీ, ఐద్వా, వైస్ఎస్ఆర్ టీపీ, సింగరేణి వివిధ విభాగాల కార్మికులు పాల్గొన్నారు.
పోలీసు ఠాణాలోనే దీక్ష
నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తుమ్మల రాజారెడ్డిని బుధవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నడుమ పోలీసులు అరెస్టు చేశారు. రాజారెడ్డిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి గోదావరిఖని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లోనూ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు.
నేడు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం..
ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టిన కార్మిక నాయకుడి నిరవధిక నిరాహార దీక్షను పోలీస్ బల ప్రయోగంతో విచ్ఛిన్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ విధానానికి నిదర్శనమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.భూపాల్, జిల్లా కార్యదర్శి ముత్యంరావు విమర్శించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. రాజారెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.