Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీఆర్ఎఫ్కు.. ఎస్డీఆర్ఎఫ్కు తేడా తెలియకపోతే ఎలా..?
- ఇది ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం : కేటీఆర్ ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి వరద సహాయంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి రాకుండా ఎప్పటిలాగే ఆయన అబద్ధాలు వల్లె వేస్తున్నారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్కు, ఎస్డీఆర్ఎఫ్కు తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలంటూ తాము డిమాండ్ చేస్తే... రాష్ట్రానికి రాజ్యంగబద్ద హక్కుగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మన రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆయన ఈ విధంగా అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి విపత్తులు లేకున్నా రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్)కు వచ్చే నిధులు తప్ప... కేంద్రం నుంచి తెలంగాణకు దక్కిందేమిటో చెప్పాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను కేంద్రం విడుదల చేసినట్టు చెప్పుకోవడం దౌర్భాగ్యకరమని విమర్శించారు. మన రాష్ట్రం కేంద్రానికి చెల్లించే పన్నుల నుంచి వివిధ రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో తిరిగి ఆయా వాటాలు రాష్ట్రానికి దక్కే మార్గాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఒకటని తెలిపారు. ఈ విషయం కిషన్‌రెడ్డికి తెలియకపోవటం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరదలు, విపత్తులు సంభవించినప్పుడు ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు ప్రస్తుతం ఇతర జిల్లాల్లో వానలు, వరదల నష్టానికి సంబంధించి సాయం చేయాలంటూ తాము కోరామని గుర్తు చేశారు. దీన్ని పక్కనబెట్టిన కేంద్ర మంత్రి... తనకు అలవాటైన అబద్ధాలను వల్లె వేశారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా రాష్ట్రానికి ఇచ్చిన అదనపు నిధుల గురించి మాట్లాడాలంటూ కేటీఆర్ ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఈనెల 19న కేంద్ర హౌంశాఖ (మినిస్టర్ ఫర్ స్టేట్) నిత్యానంద్ రారు చేసిన ప్రకటనను ఒకసారి చదువుకోవాలంటూ హితవు పలికారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ ద్వారా నిధులను కేటాయించాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉంటుందంటూ రారు పేర్కొన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. అదే ప్రకటనలో 2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఆయన ప్రకటించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. స్వయంగా తన సహచర మంత్రి పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన నిజమా..? లేక అవాస్తవమా..? అనే విషయాన్ని తేల్చుకోవాలంటూ కిషన్‌రెడ్డికి సూచించారు. కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా చైర్మెన్‌గా ఉన్న హైలెవెల్ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా విడుదలయ్యే ఎన్డీఆర్ఎఫ్ నిధులు అడిగే ధైర్యం లేకే ఆయన అబద్దాలు చెబుతున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. ఈ విధంగా సొంత రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. తమ ప్రభుత్వం పైన అభాండాలు వేసిన కిషన్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.