Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరవేగంగా కొత్త సచివాలయం పనులు
- బుల్లెట్‌ఫ్రూప్ విండోలతో సీఎంవోనే హైలెట్
- తొమ్మిది లక్షల ఎస్ఎఫ్టీతో భారీ నిర్మాణం
- దసరా నాటికి దాదాపు పూర్తి
- సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు
- డోమ్లతో ప్రత్యేక ఆకర్షణ
- గార్డెన్లు, పౌంటెన్లతో గ్రీన్ సెక్రటేరియట్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబరాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ నిర్మాణ అద్భుతం త్వరలో ఆవిష్కృతం కానుంది. సీఎం కేసీఆర్ కల. ఆయన పెట్ ప్రాజెక్టు. అదే రాష్ట్రం నూతన సచివాలయం భవనం. హైదరాబాద్‌లోని నడిబొడ్డున, హూస్సేన్‌సాగర్ తీరాన నిర్మాణానికి అంకుర్పారణ జరిగింది. ఆ భవనం తెలంగాణ చారిత్రక సౌరభానికి ప్రతీకగా ఉండాలనీ, పరిపాలనా సౌధంగా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆమేరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా భారీ సచివాలయ నిర్మాణాన్ని తలపెట్టారు. అయన ఆశయాన్ని, ప్రజల అవసరాన్ని చిధ్రం చేస్తూ కేంద్రం పరేడ్ గ్రౌండ్స్ స్థలాన్ని సచివాలయ నిర్మాణానికి ఇచ్చేందుకు నిరాకరించింది. దాదాపు ఏడాదిపాటు స్థలం కోసం ఎదురుచూసి, చివరకు పాత సచివాలయంలోని 25 ఎకరాల స్థలంలోనే పునాది రాయి వేశారు. సంవత్సరంలోపే భారీ నిర్మాణాన్ని పూర్తిచేయాలంటూ 'షాపూర్జీ-పల్లోంజీ' నిర్మాణ సంస్థకు అప్పగించారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక పర్యవేక్షణలో శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఇందు కోసం రూ. 617 కోట్ల రూపాయలు కేటాయించారు.
ముఖచిత్రం
గత ఏడాది కాలంగా కొత్త సచివాలయం పనులు జరుగుతున్నాయి. కొంత కాలం మూడు షిప్టుల్లో, ఆ తర్వాత రెండు షిప్టుల్లో పనులు వేగంగా చేస్తున్నారు.నేడు పనులు చివరి దశకు వస్తున్నాయి. వచ్చే దసరా పండుగ నాటికి సచివాలయాన్ని ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ తలపెట్టారు. అందుకనుగుణంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతిరెడ్డి నిర్విరామంగా కృషిచేస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం సచివాలయం ప్రధాన పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా పనులు 80 శాతం వరకు చేరుకున్నాయి. పండుగలు, సెలవులు అంటూ లేకుండా కార్మికులు అవిశ్రాతంగా పనిచేస్తున్నారు. చివరకు కరోనా కాలంలోనూ కేవలం రెండు నెలలు మినహా పనులకు అంతరాయం కలగకుండా ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతిరెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు.
26.9 ఎకరాల్లో
కొత్త సచివాలయం 26.9 ఎకరాల స్థలంలో నిర్మితమవుతున్నది. అందులో అన్ని భవనాల నిర్మాణం తొమ్మిది లక్షల చదరపు అడుగుల స్థలంలో జరుగుతున్నది. అందులో సీఎం కార్యాలయం భవనంలోని ఆరో అంతస్థులో ఉంటుంది. సుమారు 1.08 లక్షల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో కడుతున్నారు. ఇందులో దాదాపు 53 వేల ఎస్ఎఫ్టీ స్థలం కార్పెట్ ఏరియాకే వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు. ఆ స్థలంలో సీఎం కార్యాలయం, క్యాబినెట్ సమావేశ మందిరం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆఫీసు, సీఎం సలహాదారులు, వ్యక్తిగత కార్యదర్శుల కార్యాలయాలూ ఉంటాయి. అలాగే సీఎం కోసం వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, రాజకీయేతర వీవీఐపీలు, కూర్చునేందుకు వేర్వేరుగా ప్రత్యేకంగా వెయిటింగ్ హాళ్లనూ నిర్మిస్తున్నారు. సర్కారులోని అన్ని శాఖల మంత్రులు, బ్యూరోక్రాట్ల కార్యాలయాల కంటే సీఎం ఆఫీసే పెద్దదిగా ఉంటుంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఆరో ఆంతస్థు మొత్తం సీఎంకే కేటాయించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగిస్తున్నారు. ఆయన చాంబర్, విశాంత్రి గది మొత్తం బుల్లెట్ ప్రూఫ్ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నారు. సెక్యూరిటీ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు. డ్రయినేజీ నీళ్ల వ్యవస్థకు జర్మన్ టెక్నాలజీని వాడుతున్నారు. సీఎం సచివాలయంలోనికి మెయిన్గెట్లోని తూర్పు వైపు నుంచి రానున్నారు. ఈ కొత్త సచివాలయ భవనాలను రెక్టిలియర్ ఆకారం లో నిర్మిస్తున్నా, అందులో కేవలం 9.7(సుమారు రెండెకరాల విస్తీర్ణంలో) శాతం స్థలం మాత్రమే ఆయా భవనాల నిర్మాణాలకు వినియోగిస్తుండటం గమనార్హం.
సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు
నూతన సచివాలయం నిర్మాణం రాష్ట్రంలోని ప్రధానమైన కళాఖండాల ఆకృతుల ప్రతిబింబాలతో సాగనుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.చారిత్మ్రాక కట్టడాలు, కళలకు నెలవుగా మలచనున్నారు. గోడలపై బొమ్మలు, క్యారికేచర్లు అంటించనున్నారు. ఆరు అంతస్థుల భవనం మధ్యలో ల్యాండ్‌స్కేప్ ఆకారంలో ఉండే పెద్ద ఫౌంటేన్ ప్రత్యేక ఆకర్షణ. భవనం లోపలి ప్రాంతమంతా పచ్చిటివాతావరణంతో కనిపించేలా నిర్మాణాలు సాగుతున్నాయి. అందుకోసం చిన్న , చిన్న మొక్కలను పెంచి గార్డెన్లుగా మలచనున్నారు. మొత్తం విస్తీర్ణంలో 50 శాతం (సుమారు 12 ఎకరాలు)స్థలం గార్డెన్లకే కేటాయించారు. గ్రీన్ సెక్రటేరియేట్‌ను తలపించేలా కనిపించనుంది. 25 శాతం స్థలంలో అంతర్గతంగా రోడ్లు వేయనున్నారు. ఒకేసారి 650 కార్లు, 500 బైకులు పార్కింగ్ చేసేలా సౌకర్యం ఉంది. ఆమేరకే నిర్మాణం చోటుచేసుకుంటున్నది. బ్యాంకులు, ఏటీఎంలు ఇతరాల నిర్మాణాలలూ ఉన్నాయి. ఏడో అంతస్థుతోపాటు ఆయా చోట్ల మొత్తం 36 డోమ్‌లను ఏర్పాటు చేసి ఆకాశం నుంచి చూస్తే ఆకర్షణీయంగా కనిపించేలా నిర్మాణం జరుగుతున్నది. ఇందు కోసం నాలుగు సూపర్ క్రేన్లను వినియోగిస్తున్నారు. షాపూర్జీ-పల్లోంజీ సంస్థ 'ఇంజినీరింగ్ ఏ బెటర్ ప్లానెట్' అంటూ ఈ భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
సీఎం ఆలోచనలే...ఆచరణ
సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగినట్టుగా సచివాలయం, సీఎం కార్యాలయాన్ని నిర్మించే పనిలో ఆర్అండ్బీ శాఖ అడుగులేస్తున్నది. షాపూర్జీ-పల్లోంజీ సంస్థను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు నడుస్తున్నది. నిజానికి 2020 అక్టోబరు 28న టెండర్లు పూర్తిచేశారు. కాగా 2021 జనవరి 26న శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఐదుసార్లు సీఎం నిర్మాణ భవనాలను సందర్శించారు. మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడు చేస్తూ పనులను పరిగెత్తిస్తున్నారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. పిల్లర్లు, కాంక్రీట్ గోడలు, స్టెయిర్‌కేస్, తలుపులు, కిటికీల డిజైన్ల నాణ్యతను సీఎం స్వయంగా పరిశీలించారు. లిఫ్టులు, వాటి సంఖ్య, కెపాసిటీ గురించి సైతం ఆరా తీశారు.
అవీ...ఇవీ
సచివాలయం నిర్మాణంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. భవనాల పైభాగాలను ప్రత్యేకమైన డోమ్లతో అలంకరించనున్నారు. 1800 మంది ఉద్యోగులకు ప్రత్యేకంగా ప్రతి అంతస్థులో డైనింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో వీరికోసం 40 శాతం స్థలం అందుబాటులో ఉండేది. ఇప్పుడు దాన్ని 80 శాతానికి పెంచారు. మహిళలకు విశ్రాంతి గదులు అందుబాటులోకి రానున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా కోసం 2500 కేవీ సబ్‌స్టేషన్‌తోపాటు సోలార్ విద్యుత్ సౌకర్యమూ ఉంది. సచివాలయం ప్రాంగణంలో హెలిప్యాడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. మెట్లు, కారిడార్లు మొత్తం రెడ్సాండల్ స్టోన్‌తోనే ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లోర్లకు మాత్రం అత్యాధునిక విట్రిఫైడ్ టైల్స్ వాడుతున్నారు. ఈ భవనంలో సెల్లార్లు అనేవి ఉండవు. భవనానికి భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.
మంత్రులకు 25 చాంభర్లు
రాష్ట్ర మంత్రివర్గం సంఖ్య భవిష్యత్‌లో పెరిగినా, అప్పటి అవసరాలకు అనుగుణంగానే సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మంత్రుల సంఖ్య 18. వారికేకాక ముందు ముందు ఆ సంఖ్య అధికమైనా ఇబ్బంది కాకుండా మరో ఏడు చాంబర్లు అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 25 మంది మంత్రులకు కార్యాలయాలు అందుబాటులో ఉండనున్నాయి. సచివాలయంలో చాంబర్ల కేటాయింపు ఒకేసారి చేస్తారు. మళ్లీ మళ్లీ మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. మొత్తం భవనానికి రూ.617 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు నిర్మాణ సంస్థ షాపూర్జీ-పల్లోంజీకి సుమారు రూ. 170 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు బిల్లులు చెల్లించారు.