Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరిగిన ఫీజులు
- గరిష్టం రూ.1.34 లక్షల నుంచి రూ.1.73 లక్షలు
- కనిష్టం రూ.35 వేల నుంచి రూ.45 వేలు
- 30 కాలేజీల్లో రూ.లక్షపైన ఫీజు
- ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు
- 175 కాలేజీల ఫీజు ఖరారు చేసిన టీఏఎఫ్ఆర్సీ
- త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పేదలు, బడుగు బలహీనవర్గాల విద్యార్థులు ఇంజినీరింగ్ (బీటెక్) విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఫీజులు భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఫీజులు పెరగడంతో బీటెక్ ఎలా చదవాలన్న ఆందోళన పేద విద్యార్థుల్లో మొదలైంది. రాష్ట్రంలోని 175 ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సంప్రదింపుల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. 2022-23, 2023-24, 2024-25 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన ఫీజులను ఖరారు చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్విద్యకు సంబంధించి గరిష్ట ఫీజు సీబీఐటీలో రూ.1.73 లక్షలు, కనిష్టఫీజు రూ.45 వేలుగా టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించింది. అయితే 2019-20, 2020-21, 2021-22 బ్లాక్ పీరియడ్‌లో గరిష్ట ఫీజు రూ.1.34 లక్షలు, కనిష్ట ఫీజు రూ.35 వేలు ఉండేది. ఇప్పుడు కనిష్ట ఫీజును రూ.పది వేలు పెంచి రూ.45 వేలుగా నిర్ణయించడం గమనార్హం. ఇక గతంలో ఉన్న గరిష్ట ఫీజుకు మరో రూ.39 వేలు కలిపి సీబీఐటీ ఫీజు రూ.1.73 లక్షలుగా టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. ఆ కాలేజీ రూ.3.11 లక్షల వరకు ఫీజు పెంచాలంటూ ప్రతిపాదనలు సమర్పించింది. ఇక ఎంజీఐటీ రూ.రెండు లక్షలకుపైగా ఫీజు పెంచాలని కోరితే రూ.1.60 లక్షల ఫీజును టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. ఆ తర్వాత రూ.1.55 లక్షలు, రూ.1.53 లక్షలు, 1.50 లక్షల ఫీజులున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 30 కాలేజీల వరకు రూ.లక్షపైన ఫీజులను ఖరారు చేసినట్టు తెలిసింది. అయితే మైనార్టీకి చెందిన రెండు కాలేజీలకు మాత్రం కనిష్ట ఫీజును రూ.35 వేలుగా ఖరారు చేయడం గమనార్హం.
ప్రభుత్వం కనిష్ట ఫీజు రూ.45 వేలు చెల్లిస్తుందా?
టీఏఎఫ్ఆర్సీ కమిటీ సమావేశం ఈనెల 26న జరిగే అవకాశమున్నది. ఇంజినీరింగ్, లా, బీఈడీ, బీపీఈడీ కాలేజీల ఫీజు ప్రతిపాదనలను రూపొందించి కమిటీ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే అవకాశమున్నది. ప్రభుత్వం వాటిని పరిశీలించి ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఆ ఫీజులు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల వరకు అమల్లో ఉంటాయి. అయితే అటు విద్యార్థులపైనే కాకుండా ఇటు ప్రభుత్వంపైనా ఫీజుల భారం పడనుంది. ప్రస్తుతం ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. వారితోపాటు ఎంసెట్‌లో పదివేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికీ మొత్తం ఫీజును ప్రభుత్వమే భరిస్తుంది. ఆపైన ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కనిష్ట ఫీజును మాత్రమే చెల్లిస్తుంది. అంటే ప్రస్తుతానికి కనిష్ట ఫీజు రూ.35 వేలు ఉన్నది. దాన్ని టీఏఎఫ్ఆర్సీ రూ.45 వేలకు పెంచాలని ప్రతిపాదించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ రూ.35 వేలనే కొనసాగిస్తుందా? లేదంటే రూ.45 వేలు ఇస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానాలో ప్రస్తుతం డబ్బులకు ఇబ్బంది ఎక్కువున్నది. ఉద్యోగుల జీతాలే సకాలంలో చెల్లించలేని దుస్థితి నెలకొంది. సంక్షేమ పథకాల అమలుకూ కష్టంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కనిష్ట ఫీజు రూ.35 వేలు కొనసాగిస్తుందా?, లేక రూ.45 వేలకు పెంచుతుందా? అనేది కీలకంగా ఉన్నది. ప్రభుత్వ నిర్ణయంపైనే ఇంజినీరింగ్ విద్యను పేద విద్యార్థులు అభ్యసించే అవకాశమున్నది. ఉదాహరణకు ఎంసెట్‌లో పది వేల పైన ర్యాంకు పొందిన ఓ బీసీ విద్యార్థికి కన్వీనర్ కోటాలో సీబీఐటీలో సీటు వస్తే చేరాలా? లేదా? అన్నది ఫీజు చెల్లించడంపై ఆధారపడి ఉంటుంది. ఆ విద్యార్థికి ప్రభుత్వం కనిష్ట ఫీజు (35 వేలు లేదా 45 వేలు) మాత్రమే చెల్లిస్తుంది. అంటే మిగిలిన ఫీజును విద్యార్థి కట్టాలి. ఇలా పేద విద్యార్థులపై ఈ పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు పెనుభారం కానున్నాయి.