Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద బాధితుల సహాయక చర్యల్లో నిమగం
- 12 రోజులుగా షెల్టర్.. అన్నపానీయాలు
- బండారు, యలమంచి ట్రస్టుల అండ
- కూరగాయలు, నిత్యావసర వస్తువులు సైతం పంపిణీ
- 400 మంది వరకూ సీపీఐ(ఎం) కార్యకర్తల సర్వీస్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎర్రపూల వనంలో వికసించిన పువ్వులా.. సేవా పరిమళాలు వెదజల్లుతూ.. మేము సైతం అంటూ వరద బాధితులకు సీపీఐ(ఎం) శ్రేణులు కొండంత అండగా నిలిచాయి. సుమారు 400 మంది నాయకులు, కార్యకర్తలు 12 రోజులుగా ముంపు బాధితుల సహాయక చర్యల్లో నిమగమయ్యారు. వరదల సమయంలో బండారు చందర్రావు, యలమంచి సీతారామయ్య ట్రస్టు ఆధ్వర్యంలో వందలాది మంది బాధితులకు పాఠశాలలు, పార్టీ కార్యాలయాల్లో ఆశ్రయమిచ్చారు. గోదారి గూడేలను చుట్టుముట్టగా కట్టుబట్టలతో మిగిలిన అడవి బిడ్డలను చేరదీసి కన్నీరు తూడ్చారు. అన్నపానీయాలతో పాటు వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పాలు, పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్ల వంటివి సమకూర్చారు. భద్రాచలం డివిజన్ కేంద్రంతో పాటు దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు తదితర మండలాల్లో 'రెడ్' వాలంటీర్ల సేవలు కొనసాగాయి. సీతారామయ్య ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం వరకు తొమ్మిది వేలకు పైగా భోజనాలు సమకూర్చగా.. చందర్రావు ట్రస్టు కూడా దాదాపు ఇదే స్థాయిలో సేవలందించింది. ట్రస్టులే కాక పలువురు సీపీఐ(ఎం) నాయకులు స్వచ్ఛందంగా వందలాది మందికి ఆహారాన్ని అందించారు. స్వచ్ఛమైన నీరు కరువైన నేపథ్యంలో వాటర్‌బాటిల్స్ సైతం పంపిణీ చేశారు. చర్లలో వరదరామారావు, సమ్మక్క చుట్టుపక్కల ప్రజలకు రెండు, మూడు రోజులు రెండు పూటలా ఆహారం సమకూర్చారు. పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వరద బాధితుల సామగ్రిని సురక్షిత ప్రాంతానికి, పునరావాస కేంద్రాలకు తరలించారు. దుమ్ముగూడెం, భద్రాచలం, చర్ల ముంపు ప్రభావిత ప్రాంతాలన్ని చోట్లా ఈరకమైన సహాయక చర్యలు కొనసాగాయి.
- భద్రాద్రిలో బీసీఆర్ ట్రస్టు సేవలు..
బీసీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 25 కుటుంబాలు సీపీఐ(ఎం) కార్యాలయంలో తలదాచుకున్నారు. వంద మందికి ఐదారు రోజులు భోజనాలు, టిఫిన్లు సమకూర్చారు. భద్రాచలంలోని సుభాష్‌నగర్ నీటమునగడంతో అక్కడున్న అనాథ వృద్ధాశ్రమం కూడా గోదారి పాలైంది. ఈ నేపథ్యంలో బీసీఆర్ ట్రస్టు జిల్లా ఇన్చార్జి ఎంబీ నర్సారెడ్డి, టౌన్ కన్వీనర్ బండారు శరత్, మచ్చా వెంకటేశ్వర్లు తదితరులు స్పందించారు. వృద్ధులను చేరదీసి నాలుగైదు రోజుల పాటు సేవలందించారు. అనంతరం ఆశ్రమపాఠశాలలో వారికి ఆశ్రయం కల్పించగా మడత మంచాలను సమకూర్చారు. నిత్యం పది నుంచి 20 మంది వరకూ రెడ్వాలంటీర్లు ఇటు ట్రస్టు సేవలతో పాటు అటు పునరావాస కేంద్రాల్లోనూ సపర్యలు చేశారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ సహాయ పడ్డారు.
- నిత్యం వెయ్యి మందికి వైఎస్ ట్రస్టు సేవలు
దుమ్ముగూడెం మండలంలో యలమంచి సీతారామయ్య (వైఎస్) ట్రస్టు వరద బాధితులకు అండగా నిలిచింది. ముంపు ప్రభావిత ప్రాంత వాసులకు 12వ తేదీ నుంచి సేవలు ప్రారంభించింది. తొలిరోజు మంగవాయిబాడువ పాఠశాలలో ఆశ్రయం కల్పించి 400 మందికి అన్నపానీయాలు ఇచ్చారు. 13వ తేదీ నుంచి ట్రస్టు పునరావాస కేంద్రాన్ని మంగవాయిబాడువలోని సీపీఐ(ఎం) కార్యాలయానికి తరలించారు. 14వ తేదీ నుంచి వరద ప్రభావం మరింత ఎక్కువ కావడంతో అనేక గ్రామాలు పర్ణశాల, వర్క్‌షాప్, సున్నంబట్టి, కాశీనగరం, రేగుబల్లి, దుమ్ముగూడెం, గంగోలు డబుల్బెడ్రూం తదితర 11 గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున ట్రస్టు కేంద్రానికి చేరుకున్నారు. గురువారం నాటికి తొమ్మిది వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. వాటర్‌బాటిల్స్, ప్యాకెట్లు, పాలు, అరటిపండ్లు, బెడ్ల్రు నిరంతరం సమకూర్చుతున్నారు. వృద్ధులు, పిల్లలకు పాలప్యాకెట్లు ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటలకు భోజనాలు వడ్డిస్తున్నారు. ముంపునకు గురికాని ఇళ్లలో ఉంటున్న వారికి సైతం భోజనాలు అందించారు. నిత్యం రెడ్వాలంటీర్లు సుమారు 50 మంది వరకూ ముంపు బాధితులకు సేవలందించే పనిలో ఉన్నారు. గోదారి తగ్గడంతో ఇండ్లకు చేరుకుంటున్న బాధితులకు కూరగాయలు, నిత్యావసర వస్తువులను సైతం పంపిణీ చేస్తున్నారు.
సీపీఐ(ఎం) నాయకులే అండగా ఉన్నారు
- జూపల్లి సునీల్, వరద బాధితుడు, ఎం.కాశీనగరం
గోదావరి అంత తీవ్రంగా వస్తుందను కోలేదు. నేను, నా భార్య, ఇద్దరు చిన్నపిల్లలతో కట్టుబట్టలతో మిగిలాం. వస్తుసామగ్రి పూర్తిగా బురదలో కూరుకుపోయి ఉన్నాయి. వర్షాలు, వరదలకు బతకలేకపోతున్నాం. మా గ్రామంలో సీపీఐ(ఎం) నాయకులు మాకు అండగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. ఇండ్లలో ఉన్న బురద తీయలేకపోతున్నాం. వారం రోజులుగా మా బతుకులు బురదలోనే ఉన్నాయి. మా ఇండ్లు, సామాన్లు పనికిరాకుండా పోయాయి. వేరేచోట నివాస స్థలం చూపించి, ఇల్లు కట్టివ్వాలని వేడుకుంటున్నాం.
- రూ.లక్ష పరిహారం ఇవ్వాలి
- యలమంచి శ్రీనుబాబు, ట్రస్టు కన్వీనర్
ముంపుతో అల్లాడిన ప్రజలకు సీపీఐ(ఎం) అండగా నిలిచింది. నాన్నగారి పేరిట నెలకొల్పిన యలమంచి సీతారామయ్య ట్రస్టు ఆధ్వర్యంలో బాధితులకు సేవలందిస్తున్నాం. ఇండ్లలో ఒండ్రు పేరుకుపోయింది. పశువులు కొట్టుకుపోయాయి. కొన్ని చనిపోయాయి. బాధితులు చాలా దీనావస్థలో ఉన్నారు. ఒండ్రు తీస్తుంటే మురుగు వాసన వస్తోంది. మండలంలో 18 గ్రామాలు పూర్తిగా మునిగాయి. దీనిలో 11 గ్రామాలకు సేవలందించాం. 109 మంది మాత్రం ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు. మిగిలిన వారికి ఇండ్లకు నిత్యావసరాలు, కూరగాయలు పంపుతున్నాం. ప్రభుత్వం రూ.లక్ష పరిహారం ఇస్తే తప్ప బాధితులకు గిట్టుబాటు కాదు.