Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములకు పట్టాలివ్వాలి : వ్యకాస, గిరిజన సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనులపై అటవీ అధికారుల దాడులు ఆపాలనీ, పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ గిరిజన సంఘం సంయుక్తంగా గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్ర వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్, వ్యకాస ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ తరతరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్న రైతులపై అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న దాడులను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రోజుకొక జిల్లాలో గిరిజనులు, పేదలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై తీవ్ర నిర్బందాన్ని ప్రయోగిస్తున్నదని చెప్పారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో గత 50 ఏండ్లుగా సాగు చేస్తున్న అటవీ భూముల్లో జేసీబీలతో కందకాలు తవ్వడానికి వెళ్ళిన అటవీ అధికారులను అడ్డుకున్న గిరిజనులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న పోడు సాగుదారులందరికీ ముందుగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. పోడు భూములపై పట్టాల కోసం ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారనీ, వాటిని పరిశీలించి అర్హులైనవారికి వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కనుమరుగు చేయటం సరికాదని చెప్పారు. చట్టబద్దంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పట్టాలు ఇచ్చిన తర్వాతే.. 2005 కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగింపు డిమాండ్‌ను ప్రస్తావించాలన్నారు. అలాగే.. గిరిజనేతరులకు విధించిన 75 సంవత్సరాల సాగు నిబంధన చట్టంలో మార్పులు చేయాలంటూ కేంద్రాన్ని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని సూచించారు. కేంద్రంలో ఉన్న బీజేపి ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా నూతన అటవీ విధానం 2019 చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. దేశంలో ఉన్న అడవులు, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే దాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇటువంటి తరుణంలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, పేదలకు అనుకూలంగా త్వరగా మార్పులు చేస్తుందనే నమ్మకం కలగడం లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పోడు సాగుదారులకు హక్కులు కల్పించే వరకూ ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. ధర్మ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుగులోత్ ధర్మ, ధీరావత్ రవినాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు భూక్యా వీరభద్రం, అంగోత్ వెంకన్న. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శులు జగన్, ఆల్వాల వీరన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు, రేపాకుల శ్రీనివాస్, నూతన్. మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ, బండి పద్మ , కె వి పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహార్ తదితరులు పాల్గొన్నారు.