Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలనీ, ఎన్నికల సమయంలో వారికిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయినా కార్మికులకిచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేరలేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్మినెంట్ కార్మికులు 64వేల మంది ఉంటే..స్వరాష్ట్రంలో వారి సంఖ్యను 42 వేల మందికి తగ్గించారని పేర్కొన్నారు. అప్పట్లో కాంట్రాక్టు కార్మికులు 12వేల మంది ఉంటే.. ప్రస్తుతం 25వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. కొన్ని బ్లాకులు, బొగ్గుబావులు ప్రయివేటు వారికి కట్టబెడుతున్నారనీ, రాష్ట్ర ప్రభుత్వం రూ. 22వేల కోట్లు సింగరేణి కంపెనీకి బాకీపడిందని పేర్కొన్నారు. గతంలో జరిగిన యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా ''సొంతింటి పథకం'' అమలు చేస్తాం, బినామీ పేర్లు సరిదిద్దుతామనీ, ప్రతి కార్మికుడికి 250 చదరపు గజాల ఖాళీ స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు వడ్డీ లేని రుణంగా ఇస్తామంటూ ప్రభుత్వం వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరో పక్క 50ఏండ్ల కింద నిర్మించిన క్వార్టర్లు దెబ్బతింటున్నాయని తెలిపారు. దెబ్బతిన్న ఇండ్లను కూల్చివేసి అదే స్థలంలో డబుల్ బెడ్రూంలు కట్టించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలనీ, డిపెండెంట్ల వయస్సును 35 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.