Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వారిపై వేధింపులను ఆపాలని గ్రామపంచాయతీ కార్మికుల సంఘం (సీఐటీయూ) సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్దాసు గణేష్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిరొజులుగా గ్రామపంచాయతీ కార్మికుల పట్ల పాలకవర్గ సభ్యులు, మండల పరిషత్ అధికారుల వేధింపులు తీవ్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ అధికారి ఇచ్చిన సర్క్యూలర్లు అమలు చేయడంలో విఫలమవుతున్నారన్నారు. జీపీ కార్మికులకు రెండు నెలల నుంచి వేతనాలురాక ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. అన్ని రంగాల కార్మికుల వేతనలు పెంచిన ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం ఇంకా పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామపంచాయతీలో కార్మికుల పనిగంటలు సూచించే బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. వారాంతపు సెలవులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో సర్పంచ్ భర్త వేధింపుల వల్ల ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలకవర్గాల వేధింపులు ఆపకపోతే నిరవదిక సమ్మెకు వెళ్లేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు మూషం రమేష్, గ్రామపంచాయతీ వర్కర్స్ యునియన్ జిల్లా అధ్యక్షుడు మల్యాల నర్సయ్య, గౌరవ అధ్యక్షుడు రేసు రాజయ్య, వివిధ మండల అధ్యక్షులు వర్కొలు మల్లయ్య, బుర శ్రీనివాస్, గాదం రాజయ్య, దుండ్రపెల్లి రవిందర్, అక్కనపెల్లి లక్షణ్, కసార్ల భుపాల్ పాల్గొన్నారు.