Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జర్నలిజం, కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్‌డీకి సంబంధించి చేసిన పరిశోధనకుగాను బంగారు పతకం పొందిన తన ప్రజా సంబంధాల అధికారి మాణిక్య మహేష్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ''గ్రామీణాభివృద్ధిలో కమ్యూనికేషన్ వ్యూహాల మూల్యాంకనం''అనే అంశం పై ప్రొఫెసర్ వి.సత్తిరెడ్డి ఆధ్యర్యంలో పరిశోధన చేసి మహేష్ సమర్పించిన గ్రంథానికి డాక్టరేట్ డిగ్రీతో పాటు బంగారు పతకాన్ని తెలుగు యూనివర్సిటీ ప్రదానం చేసింది. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధిని ప్రజల వద్దకి మరింత వేగంగా, సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన కమ్యూనికేషన్ వ్యూహాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మహేష్ తన అధ్యయనంలో గుర్తించారు. ఈ పరిశోధనకు గురువారం రవీంద్రభారతిలో జరిగిన తెలుగు విశ్వవిద్యాలయ 15వ స్నాతకోత్సవంలో భాగంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని యూనివర్సిటీ ఆయనకు అందించింది. ఈ నేపథ్యంలో తన ప్రజా సంబంధాల అధికారి మహేష్‌ని శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆయన చేసిన పరిశోధనా తాలూకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టరేట్ డిగ్రీతో పాటు ప్రత్యేకంగా బంగారు పథకాన్ని పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జర్నలిజం, కమ్యూనికేషన్ రంగంలో తన అధ్యయనాన్ని ఇంతే నిబద్ధతతో కొనసాగించాలని సూచించారు.