Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే నుంచి ఇందిరాపార్క్ వరకు ప్రదర్శన
- హమాలీ, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి:
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను సవరించాలనీ, విడుదల చేసిన ఐదు జీవోలను గెజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల మూడున చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించా లని కోరుతూ అదేరోజు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) నుంచి ఇందిరాపార్క్ వరకు ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అనంతరం మహాధర్నా జరుగుతుందని చెప్పారు. హమాలీ, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చలో హైదరా బాద్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విలేకర్లతో చుక్క రాములు, పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల 26న డీసీఎల్, ఏసీఎల్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని అన్నారు. ఈనెల 27 నుంచి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ప్రచారం చేస్తామన్నారు. జీపుజాతాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను సవరించకుం డా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందని విమర్శిం చారు. తెలంగాణ వస్తే అన్ని సమస్యలూ పరిష్కార మవుతాయనీ, ఉద్యమ సమయంలో నేటి పాలకులు చెప్పారని గుర్తు చేశారు. ఐదేండ్లకోసారి కనీస వేతనాల జీవోపై సమీక్షించి సవరించాలని సూచిం చారు. ఎనిమిదేండ్లవుతున్నా కార్మికులకు కనీస వేతనాలను ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. సంపద సృష్టికి కారణమైన వారిని పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమాలు, సమ్మెలు చేసినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని చెప్పారు. మూలవేతనంలో కరువు భత్యం కలిపి ఇవ్వడం అశాస్త్రీయ ఆలోచన అని విమర్శించారు.
కోర్టులు, త్రైపాక్షిక కమిటీ సిఫారసులు బుట్టదాఖలవుతున్నాయని అన్నారు. కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయిస్తూ జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు, రవాణా కార్మికులు, హమాలీ, బీడీ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. హమాలీ, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డులేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారనీ, కనీసం వారికి గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాల ఒత్తిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి కనీస వేతనాలను సవరించడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని అన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలనూ ఎండగడతామని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, ఎస్ రమ, ఉపాధ్యక్షులు ఆర్ కోటంరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి సుధాకర్, పి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.20 కోట్ల మంది కార్మికులున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక్క సంతకం పెడితే వారికి కనీస వేతనాలు అందుతాయనీ, ఎనిమిదేండ్లయినా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు ఎక్కడా పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటివి అమలు కావడం లేదని చెప్పారు. కార్మిక మంత్రి డమ్మీ అని విమర్శించారు. ఎలాంటి షరతుల్లేకుండా బీడీ కార్మికులకు జీవనభృతిని అమలు చేయాలనీ, జీవో నెంబర్ 41ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అడ్డాల వద్ద షెడ్లు, మరుగుదొడ్లు, కనీస వసతులు కల్పించాలని కోరారు. వారికి డబుల్బెడ్రూం ఇండ్లు, వాహనాలు ఇవ్వాలన్నారు. చలాన్ల పేరుతో రవాణా కార్మికులపై భారాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న పాల్గొన్నారు.