Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలవంతంగా నిరాహార దీక్షను విరమింపజేసిన పోలీసులు
- పారిశ్రామిక ప్రాంతంలో పెద్దఎత్తున నిరసనలు
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
సీఎం కేసీఆర్ హామీలను సింగరేణిలో అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖనిలో చేపట్టిన నిరాహార దీక్షను గురువారం పోలీసులు బలవంతంగా విరమింపజేశారు. బుధవారం సాయంత్రం దీక్షా శిబిరం నుంచి దౌర్జన్యంగా పోలీసులు రాజారెడ్డిని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా ఆయన నిరాహార దీక్ష కొనసాగించారు. దాంతో పోలీసులు రాజారెడ్డిని రాత్రికి రాత్రే గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం రాజారెడ్డిని పరీక్షించిన వైద్య బృందం షుగర్ లెవెల్ పడిపోతున్నాయని చెప్పారు. ఆరోగ్యం విషమస్థితికి చేరుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బలవంతంగా ఆయనకు సెలైన్ పెట్టించారు. శాంతియుతంగా చేపట్టిన దీక్షను ప్రభుత్వం పోలీసులతో బలవంతంగా విరమింపజేయటం దుర్మార్గమని వివిధ కార్మిక, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం రాజారెడ్డిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
పోరాటం కొనసాగుతుంది : రాజారెడ్డి
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు విభిన్న రూపాల్లో పోరాటం కొనసాగిస్తామని రాజారెడ్డి విలేకరులతో చెప్పారు. ఉద్యమాలను అణచివేయడం ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించలేరని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి భవిష్యత్ కార్యాచరణను త్వరలో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో ఖరారు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చమనడం కూడా నేరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పద్ధతి గత పాలకులు కొనసాగిస్తే తెలంగాణ వచ్చేదా అంటూ ప్రశ్నించారు.
సింగరేణి బొగ్గు గనులపై నిరసన
కార్మిక నేత తుమ్మల రాజారెడ్డి దీక్ష శిబిరంపై పోలీసుల దాడికి నిరసనగా గురువారం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో కార్మికులు ధర్నాలు, సభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయమనడం కూడా నేరమేనా అని సీఐటీయూ నాయకులు ప్రశ్నించారు. కేసీఆర్ డౌన్ డౌన్, పోలీసుల దాడిని ఖండించండి, పోలీసులతో ఉద్యమాలను ఆపలేరని బొగ్గు గనులపై కార్మిక లోకం నినదించింది. రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడికే 1,2, 2ఏ, 11, ఓసిపి 5, ఏరియా వర్క్ షాప్, సివిల్, సింగరేణి సెక్యూరిటీ విభాగంలో సభలు నిర్వహించారు. రామగుండం డివిజన్ 2 పరిధిలోని జీడీకే ఓసిపి త్రీ, వకీల్ పల్లి గనులు, ఆర్జీ 3 పరిధిలోని ఓసిపి వన్, ఓసిపి టు గనులపై నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యం రావు, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.మధు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు మేండే శ్రీనివాస్, సారయ్య, ఉల్లి మొగిలి, రాజన్న, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖనిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.