Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ, మున్సిపల్ శాఖలు, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి :
యుద్ద ప్రాతిపాదికన బూస్టర్ డోసును పంపిణీ చేయాలి : మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. డెంగ్యూ లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, వెంటనే చికిత్స అందించాలని చెప్పారు. ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోకుండా, ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న వైద్య సేవలను వారు సద్వినియోగం చేసుకునెలా చూడాలని కోరారు. చికిత్స, రోగ నిర్ధారణ పరీక్షల సేవల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్, పంచాయతీ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుద్ధ్యం పట్ల అవగాహన పెంచాలన్నారు. సబ్ సెంటర్ల వారీగా జరుగుతున్న ఎన్సీడీ స్క్రీనింగ్ వంద శాతం పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంతో బూస్టర్ డోసు పంపిణీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంపీలు, ఎమ్మేల్యేలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో వాక్సినేషన్‌ను వేగంగా నిర్వహించాలని కోరారు. ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వారానికి రెండు, మూడు రోజులు జిల్లాల్లో పర్యటిస్తూ, పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని, వచ్చే పది రోజుల్లో వాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని డిహెచ్ శ్రీనివాస్ రావును ఆదేశించారు. రాష్ట్రంలో 2,77,67,000 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటి వరకు 12,87,411 మందికి బూస్టర్ పంపిణీ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 20 లక్షల పైగా డోసులు నిల్వ ఉన్నాయని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉందనీ, అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ప్రత్యేకంగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్య అధికారులను ఆదేశించారు. 040-24651119 నెంబర్లో సంప్రదిస్తే.. 100 మంది కంటే ఎక్కువ మంది లబ్దిదారులు ఉన్న చోట వాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ విషయంపై ప్రచారం కల్పించాలన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.
ప్రతి గర్భిణికి నాలుగు ఏఎన సి చెకప్ లు పక్కగా జరిగేలా చూడాలన్నారు. సూర్యాపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ,ములుగు, వికారాబాద్ జిల్లాల్లో పనితీరు తక్షణం మెరుగుపడాలని సూచించారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో సి సెక్షన్లు బాగా తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. సబ్ సెంటర్ వారీగా జిల్లా వైద్యాధికారులు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలు పెరగాలనీ, 24 గంటలు పని చేసే కేంద్రాల్లో అన్ని వేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.. ఎనీమియాను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ డయాగస్టిక్ ద్వారా 24 గంటల్లో పరీక్ష ఫలితాలు వచ్చేలా చేసి, మరుసటి రోజు పేషెంట్ ఆ ఫలితాలు వైద్యులకు చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఉండే టి- డయాగస్టిక్ బాధ్యత ఆయా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు తీసుకోవాలని ఆదేశించారు.
శుక్రవారంలోగా ప్రతిపాదనలు
మరమ్మతులు, కొత్త భవనాలు అవసమున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వివరాలపై తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జిల్లా వైద్యారోగ్య అధి కారులు మరోసారి సమీ క్షించి తుది ప్రతిపా దనలు తయారు చేయా లని మంత్రి ఆదేశిం చారు. వాటిని శుక్రవారంలోగా పంపిం చాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.